Petrol: రాష్ట్రాలు ఒప్పుకోవు.. పెట్రోల్‌ ధరలు తగ్గవు..!

పెట్రోల్‌, డీజిల్‌ వంటి చమురు ఉత్పత్తులు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవని, అందుకే దేశంలో పెట్రోల్‌ ధరలు దిగివచ్చే

Updated : 23 Sep 2021 18:30 IST

కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వ్యాఖ్యలు

కోల్‌కతా: పెట్రోల్‌, డీజిల్‌ వంటి చమురు ఉత్పత్తులు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవని, అందుకే దేశంలో పెట్రోల్‌ ధరలు దిగివచ్చే అవకాశాలు లేవని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి అన్నారు. భవానీపూర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కోల్‌కతా వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

‘‘పెట్రోల్‌ ధరలను తగ్గించాలని అనుకుంటున్నారా? అని మీరు(మీడియాను ఉద్దేశిస్తూ) అడిగితే మా సమాధానం ‘అవును’ అని చెబుతాం. అదే పెట్రోల్‌ ధరలు ఎందుకు తగ్గడం లేదు? అని అడిగితే మాత్రం.. దానికి కారణం రాష్ట్రాలే అని చెప్పాలి. ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించట్లేదు. లీటర్‌ పెట్రోల్‌ ధరలో కేంద్రానికి వచ్చే వాటా రూ.32. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర బ్యారెల్‌కు 19 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్‌పై రూ.32 పన్ను వసూలు చేశాం. ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్లుగా ఉంది. అయినప్పటికీ కేంద్రం రూ.32 మాత్రమే వసూలు చేస్తోంది. దీంతోనే కేంద్రం ఉచిత రేషన్, ఉచిత గృహాలు, ఉజ్వల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది’’ అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. 

ఇటీవల జరిగిన జీఎస్‌టీ మండలి 45వ సమావేశంలో పెట్రోఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అంశంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు అనేక రాష్ట్రాలు సుముఖత చూపలేదని, ప్రభుత్వాల ఆదాయాలపై ప్రభావం పడే వీలుండటమే ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇది సరైన సమయం కాదని ఆమె అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని