PFI: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా.. ఏమిటీ సంస్థ..? సోదాలు ఎందుకు..?

దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారీస్థాయిలో దాడులు చేస్తోంది.

Published : 23 Sep 2022 02:29 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారీస్థాయిలో దాడులు చేస్తోంది. సుమారు 200 మంది ఎన్‌ఐఏ అధికారులు 11 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి ఇప్పటివరకు వంద మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోన్న ఆ ఆపరేషన్‌ను ఎన్‌ఐఏ చరిత్రలోనే అతిపెద్ద సోదాలుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) అనే సంస్థ ఎలా రూపుదాల్చింది. దాని కార్యకలాపాలేంటో ఓసారి చూద్దాం..

* ముస్లిం వర్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఓ వేదికను రూపొందించాలనే ఉద్దేశంతో కేరళ, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన మూడు సంస్థలు ఏకమయ్యాయి.

కేరళ మలప్పురం జిల్లాలోని మంజెరీలో 2006లో నిర్వహించిన సమావేశంలో అదే రాష్ట్రానికి చెందిన నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫ్రంట్‌ (NDF), తమిళనాడుకు చెందిన మనిద నీథి పాసారాయ్‌, కర్ణాటకకు చెందిన ఫోరం ఫర్‌ డిగ్నిటీలు ఓ ఏకాభిప్రాయానికి వచ్చాయి.

ఆ సమావేశం జరిగిన అనంతరం నాలుగు నెలలకు (అదే ఏడాది) ఆ మూడు సంస్థలు విలీనమవుతూ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI)గా అవతరించాయి.

పీఎఫ్‌ఐగా ఏర్పడిన కొద్ది కాలానికే ఆ సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇలా దక్షిణ భారత్‌లో మొదలైన ఆ సంస్థ దేశంలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపించింది. కొన్ని రాష్ట్రాల్లోని సామాజిక సంస్థలు కూడా అందులో కలిసిపోవడంతో ఆ సంస్థ మరింత బలోపేతం అయ్యింది.

దీనికింద సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (SDPI), విద్యార్థి విభాగమైన క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ వుమెన్స్‌ ఫ్రంట్‌, రెహబ్‌ ఇండియా ఫౌండేషన్‌తోపాటు ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌ వంటి అనుబంధ సంస్థలు ఏర్పడ్డాయి.

బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఏడాది తర్వాత 1993లో ఏర్పాటైన ఎన్‌డీఎఫ్‌నకు, పీఎఫ్‌ఐల మధ్య మూలాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. 2002, 2003లో కేరళలో జరిగిన మతఘర్షణలు, ఇరు వర్గాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి నిషేధిత సిమి (SIMI) సంస్థ మాజీ నేతలతో ఏర్పాటైన ఎన్‌డీఎఫ్‌ కార్యకలాపాలే కారణమన్న వార్తలు వచ్చాయి.

ఐతే, దేశంలో వెనకబడిన ముస్లిం వర్గాల పరిస్థితులను మెరుగుపరిచేందుకే కృషి చేస్తున్నామని పీఎఫ్‌ఐ చెబుతున్నప్పటికీ.. కేరళ వంటి రాష్ట్రాల్లో మతపరమైన హింసకు ఈ సంస్థ కార్యకలాపాలే ఆజ్యం పోశాయనే ఆరోపణలు ఉన్నాయి.

2011లో జరిగిన హింసాత్మక సంఘటనలకు ఈ సంస్థ కార్యకలాపాలకు సంబంధం ఉందనే ఆరోపణలపై పలువురు పీఎఫ్‌ఐ సభ్యులు అరెస్టయ్యారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో చేపట్టిన సీఏఏ నిరసనలు, కేరళలో లవ్‌ జిహాదీ వంటి ఘటనలతో పీఎఫ్‌ఐకి సంబంధముందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కేరళలో ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపా నేతల హత్యల కేసుల్లోనూ పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థల సభ్యులు అరెస్టయ్యారు.

పీఎఫ్‌ఐ సంస్థలకు వస్తోన్న నిధులపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తోపాటు ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు జరుపుతున్నాయి. ముఖ్యంగా నిధుల సమీకరణ కోసం పీఎఫ్‌ఐ సభ్యులు మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌ ద్వారా తన లక్ష్య సాధనకు పీఎఫ్‌ఐ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది.

ఇలా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్‌ఐ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్‌ను కేంద్ర హోంశాఖ చేపట్టింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని