PFI: పీఎఫ్‌ఐపై మరోసారి ఎన్‌ఐఏ దాడులు: వందల మంది అనుమానితులు అదుపులోకి..!

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతలకు చెందిన ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోసారి దాడులు నిర్వహిస్తున్నాయి.

Updated : 27 Sep 2022 14:25 IST

దిల్లీ: ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతలకు చెందిన ప్రదేశాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి మరోసారి దాడులు నిర్వహిస్తోంది. పీఎఫ్‌ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యుల కార్యాలయాలపై మంగళవారం సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, తెలంగాణ, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి నిధులు అందుకొని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై గతవారం ఎన్‌ఐఏ ఆకస్మిక దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఇచ్చిన సమాచారంతో కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో ఈ దాడులు జరుగుతున్నాయి.

వరుస దాడుల్లో పలువురు అదుపులోకి..!

దిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం దిల్లీలోని రోహిణి, నిజాముద్దీన్‌, జామియా, షహీన్ బాగ్‌, సెంట్రల్‌ దిల్లీలో దాడులు చేపట్టింది. 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా జామియా విశ్వవిద్యాలయం పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. అలాగే పారామిలిటరీ బలగాలను మోహరించారు. మహారాష్ట్రలోని జౌరంగాబాద్‌, సోలాపూర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక, అస్సాం, యూపీలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

గతవారం పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన దాడుల్లో 100 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అత్యధికంగా కేరళలో 22, మహారాష్ట్రలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో ఎన్‌ఐఏ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, లష్కరే తోయిబా, ఐసిస్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రముఠాల్లో చేరేలా యువతను ప్రేరేపిస్తోందని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని