PFI: దసరా వేళ భాజపా, RSS నేతలపై పీఎఫ్‌ఐ టార్గెట్‌..!

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ 

Published : 26 Sep 2022 17:45 IST

వెలుగులోకి సంచలన విషయాలు

ముంబయి: ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాల తర్వాత ఈ సంస్థ గురించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పీఎఫ్‌ఐ కుట్రలు పన్నుతున్నట్లు తాజాగా బయటికొచ్చింది. దసరా నవరాత్రుల వేళల్లో ఈ నేతల కదలికలపై దృష్టిపెట్టాలని పీఎఫ్‌ఐ ప్రణాళికలు రచించినట్లు మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం వర్గాలు వెల్లడించాయి.

నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం కూడా పీఎఫ్‌ఐ టార్గెట్‌ లిస్ట్‌లో ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని ఈ సంస్థ ప్రణాళికలు చేసినట్లు సమాచారం. వీరిని టార్గెట్‌ చేసుకుని దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. భాజపా, సంఘ్‌నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు కూడా నిర్వహించినట్లు సమాచారం ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నేతలు, సంస్థలకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

గతవారం పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి ఆకస్మిక దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 100 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. అత్యధికంగా కేరళలో 22, మహారాష్ట్రలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో ఎన్‌ఐఏ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, లష్కరే తోయిబా, ఐసిస్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రముఠాల్లో చేరేలా యువతను ప్రేరేపిస్తోందని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు