PFI: లష్కరే, ఐసిస్‌లో చేరేందుకు పీఎఫ్‌ఐ ప్రేరేపిస్తోంది.. ఎన్‌ఐఏ నివేదిక

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతలు ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనేక పత్రాలు

Updated : 24 Sep 2022 19:21 IST

కోచి: ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనేక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ పత్రాల్లో అత్యంత కీలక సమాచారం లభించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. లష్కరే తోయిబా, ఐసిస్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రముఠాల్లో చేరేలా ఈ సంస్థ యువతను ప్రేరేపిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదకలో పేర్కొంది.

పీఎఫ్‌ఐ కార్యాలయాల్లో జరిపిన సోదాల సందర్భంగా కొంతమంది సంస్థ సభ్యులను అధికారులు అరెస్టు చేశారు. అందులో 10 మంది కస్టడీ కోరుతూ ఎన్‌ఐఏ న్యాయస్థానంలో రిమాండ్‌ రిపోర్ట్‌ దాఖలు చేసింది. ఈ నివేదికను సెప్టెంబరు 22న కోర్టుకు సమర్పించగా.. అందులోని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పీఎఫ్‌ఐ ప్రభుత్వ విధానాలను వక్రీకరిస్తూ.. ఓ వర్గం వారిలో దేశం పట్ల విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని నివేదిక పేర్కొంది. అంతేగాక, ఓ వర్గానికి చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్రలు రచిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ నివేదిక తెలిపింది. ఈ కుట్రలకు సంబంధించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు ఆ 10 మందిని కస్టడీకి అనుమతించాలని ఎన్‌ఐఏ న్యాయస్థానాన్ని కోరింది. ఇందుకు అనుమతించిన ప్రత్యేక కోర్టు.. నిందితులకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

మోదీ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు కుట్రలు..

పీఎఫ్‌ఐ కార్యాలయాల్లో ఎన్‌ఐఏతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా సోదాలు జరిపింది. ఈ సందర్భంగా కేరళలో కొంతమంది పీఎఫ్‌ఐ సభ్యులను అదుపులోకి తీసుకుంది. వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ప్రధాని మోదీ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు కుట్రలు పన్నినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

ఈ ఏడాది జులై 12న మోదీ బిహార్‌లో పర్యటించారు. ఆ సమయంలో ప్రధాని ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు ప్రణాళిక రచించామని పీఎఫ్‌ఐ సభ్యుడు ఒకరు విచారణలో చెప్పినట్లు ఈడీ తెలిపింది. అందుకోసం శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడమే గాక, పోస్టర్లు, బ్యానర్లను కూడా సిద్ధం చేసినట్లు ఆ సభ్యుడు తెలిపినట్లు సమాచారం. అంతేగాక, దేశంలో ఉగ్ర కార్యకలాపాల కోసం పీఎఫ్‌ఐ విదేశాల నుంచి నిధులు సేకరించిందని ఈడీ గుర్తించింది.

విదేశాల నుంచి నిధులు అందుకొని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న అభియోగాల నేపథ్యంలో సెప్టెంబరు 22న పీఎఫ్‌ఐ కార్యాలయాలపై ఎన్‌ఐఏ, ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో సోదాలు జరిపి 106 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్‌ఐ ప్రభావం అధికంగా ఉన్న కేరళలో 22 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో ఆ సంస్థ ఛైర్మన్‌ ఓ.ఎం.ఎ.సలామ్‌ కూడా ఉన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని