PFI: పీఎఫ్‌ఐ ట్విటర్‌ ఖాతా నిలిపివేత

ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై కేంద్రం నిషేధం విధించిన మరుసటి రోజే ఆ సంస్థపై ప్రముఖ సామాజిక మాధ్యమం

Published : 29 Sep 2022 10:41 IST

దిల్లీ: ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై కేంద్రం నిషేధం విధించిన మరుసటి రోజే ఆ సంస్థపై ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ కూడా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పీఎఫ్‌ఐ అధికారిక ఖాతాలను గురువారం నుంచి నిలిపివేసింది.

ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పీఎఫ్‌ఐ పై కేంద్ర హోంశాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పీఎఫ్‌ఐ, ఎనిమిది అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, డిజిటల్‌ మాధ్యమం వేదికగా ఈ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉన్న దృష్ట్యా.. పీఎఫ్‌ఐకి చెందిన అన్ని వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ట్విటర్‌ నేడు పీఎఫ్‌ఐ ఖాతాలను బ్లాక్‌ చేసింది. పీఎఫ్‌ఐ అధికారిక ట్విటర్‌ ఖాతాకు దాదాపు 81వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

సంస్థ నిర్వీర్యం..

ఉగ్ర ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తూ దేశ భద్రతకు ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంటూ పీఎఫ్‌ఐపై కేంద్రం నిషేధం విధించింది. ఇటీవల ఈ సంస్థ కార్యలయాలు, నేతలపై 15 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహించి.. వందమందికి పైగా ఆ సంస్థ కీలక నేతలను, మద్దతుదారులను అరెస్టు చేసింది. ఆ తర్వాత కేంద్రం నిషేధంపై నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ సంస్థ కూడా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం చర్య నేపథ్యంలో తమ విభాగాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నట్లు పీఎఫ్‌ఐ నిన్న వెల్లడించింది. అయితే నిషేధంపై ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని