Published : 14 May 2021 16:28 IST

Pfizer: 12 వారాల గడువుతో విస్తృత యాంటీబాడీలు!

బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

లండన్‌: కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందన మరింతగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న 12 వారాల తర్వాత రెండో డోసు ఇవ్వడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందనలు దాదాపు మూడున్నర రెట్లు పెరిగినట్లు బ్రిటిష్‌ అధ్యయనంలో తేలింది. దీంతో వ్యాక్సిన్‌ డోసుల వ్యవధిని పెంచడం సరైన నిర్ణయమనడానికి ఇటువంటి శాస్త్రీయ అధ్యయనాలు మద్దతుగా నిలుస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన ప్రారంభంలో చాలా వ్యాక్సిన్లు మూడు, నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసులను అందించాయి. ఇందులో భాగంగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులను మూడు వారాల గడువుతో ఇచ్చి ప్రయోగాలు జరపడంతో.. పంపిణీలోనూ అదే విధానాన్ని పాటించింది. ఈ సమయంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగంగా చేపడుతోన్న బ్రిటన్‌లో ఫైజర్‌ టీకానే అధికంగా వినియోగిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభ సమయంలో రెండు డోసుల మధ్య వ్యవధి మూడు వారాలే ఇచ్చిన్నప్పటికీ అనంతరం వ్యాక్సిన్‌ విధానంలో మార్పులు చేశారు. ఈ గడువును 12వారాలకు బ్రిటన్‌ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం అదే విధానంలో అక్కడ వ్యాక్సిన్‌ పంపిణీ చేపడుతోంది.

డోసుల మధ్య గడువును పెంచిన నేపథ్యంలో.. వీటి పనితీరును తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హమ్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం 80 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న 175 మందిపై అధ్యయనం జరిపారు. వీరి సమాచారాన్ని.. మూడు వారాల గడువుతో వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోల్చి చూశారు. తద్వారా 12 వారాల వ్యవధి తర్వాత రెండో డోసు తీసుకున్న వృద్ధుల్లో యాంటీబాడీలు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని అధ్యయనానికి నేతృత్వం వహించిన బర్మింగ్‌హమ్‌ యూనివర్సిటీ నిపుణులు హెలెన్‌ ప్యారీ పేర్కొన్నారు. వీటిపై మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

బ్రిటన్‌ విధానంతో సత్ఫలితాలే..!

రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీలు ఒకభాగం మాత్రమే. వ్యాక్సిన్‌ల వల్ల కేవలం యాంటీబాడీలే కాకుండా టి-కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి. అయితే, మూడు వారాల గడువులో రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఈ టి-కణాలు గణనీయంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఏ విధానాన్ని అనుసరించి వ్యవధిని పెంచుతారనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మిగిలింది. ఏదేమైనప్పటికీ వ్యాక్సిన్‌ పంపిణీలో బ్రిటన్‌ తీసుకున్న విధానం నిజంగా సత్ఫలితాలిచ్చిందని ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య విభాగానికి చెందిన కన్సల్టెంట్‌ ఎపిడమాలజిస్ట్‌ గాయత్రీ అమిర్థలింగం స్పష్టంచేశారు. అంతేకాకుండా ఈ విధానం వల్ల మరింత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇక ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో లభ్యమవుతున్న విషయం తెలిసిందే. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేస్తోన్న ఈ వ్యాక్సిన్‌ రెండు డోసుల గడువును 12 నుంచి 16 వారాలకు పెంచుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల మధ్య గడువు వల్ల ఏవిధమైనా ఫలితాలు ఉంటాయనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని పొడిగించడాన్ని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సమర్థించారు. వ్యాక్సిన్ల కొరత ఉన్నప్పుడు ఎక్కువ మందికి తొలి డోసు ఇవ్వడానికి ఇది సరైన నిర్ణయమని తెలిపారు. దీనివల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ సామర్థ్యం విషయంలో ఇది ప్రయోజనమే చేకూరుస్తుందని తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని