మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించిన ఫైజర్‌

జన్యుమార్పిడి చెందుతున్న కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఫైజర్‌ సంస్థ వ్యాక్సిన్‌ మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించింది. ఈ మేరకు ఫైజర్‌ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 25 Feb 2021 20:17 IST

వేరియంట్లను ఎదుర్కొనేందుకేనన్న సంస్థ

వాషింగ్టన్‌: జన్యుమార్పిడి చెందుతున్న కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఫైజర్‌ సంస్థ వ్యాక్సిన్‌ మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించింది. ఈ మేరకు ఫైజర్‌ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సంవత్సరం క్రితం ఫైజర్‌ వ్యాక్సిన్‌ మొదటిదశ ప్రయోగాల్లో పాల్గొన్న వారికే ఈ మూడో డోసును అందిస్తున్నామని వారు వెల్లడించారు. వారికి వ్యాక్సిన్‌ మూడో డోసు అందించిన తర్వాత వారిలో కొత్త రకం వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఎంత మేరకు అభివృద్ధి చెందాయో పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు.
మరోవైపు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వేరియంట్‌కు వ్యాక్సిన్‌ ప్రయోగాలు మరో నెలలో ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ‘‘మా వ్యాక్సిన్‌ ప్రస్తుతమున్న వేరియంట్లను సమర్థవంతంగానే ఎదుర్కొంటుంది. కానీ ముందు జాగ్రత్తగా వేరే మార్గాలను కూడా అన్వేషిస్తున్నాం.’’ అని ఫైజర్‌ సీఈవో ఆల్బర్ట్‌ బౌర్లా తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న ప్రయోగ ఫలితాలు రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. వేరియంట్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యాక్సిన్‌ అవసరమైనా, సిద్ధం చేసేందుకు ఫైజర్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

అమెరికాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ పూర్తి స్థాయి వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వలేదు. కానీ 16 సంవత్సరాలు పైబడిన వారి కోసం అత్యవసర వినియోగ అనుమతినిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కొత్తరకం వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నిపుణులు ప్రస్తుతమున్న వ్యాక్సిన్ల సమర్థతను పరిశీలిస్తున్నారు. ఫైజర్‌ ఇప్పటికే తమ వ్యాక్సిన్‌ వేరియంట్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో నిరూపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని