ఫైజర్ వ్యాక్సిన్‌.. 12-15ఏళ్ల పిల్లల్లో 100శాతం సమర్థత!

కరోనా వ్యాక్సిన్‌పై ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కీలక ప్రకటన చేసింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్‌ చిన్న పిల్లల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది.

Updated : 23 Feb 2024 17:17 IST

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌పై ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కీలక ప్రకటన చేసింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్‌ చిన్న పిల్లల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా 12-15 ఏళ్ల వయసు పిల్లల్లో టీకా వందశాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఈ వయసు వారికి టీకా ఇచ్చేందుకు అనుమతి కోసం నియంత్రణ సంస్థలను సంప్రదిస్తామని ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

ఇప్పటివరకు దాదాపు 65దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌ టీకాను 16ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చేందుకే అనుమతి ఉంది. ఇప్పటికే ఫైజర్‌ టీకా 90శాతానికి పైగా సమర్థత కలిగినట్లు పలు నివేదికల్లో వెల్లడైంది. క్లినికల్‌ ప్రయోగాలే కాకుండా ఇజ్రాయెల్‌లో ఈ టీకాను 12లక్షల మందికి ఇవ్వగా, అక్కడ కూడా 94శాతం సమర్థత కలిగినట్లు తేలింది. ఇదే సమయంలో చిన్నారుల కోసం టీకా తెచ్చేందుకు ఫైజర్‌ ప్రయత్నాలు కొనసాగించింది. ఇందుకోసం అమెరికాలో 2260 మంది 12-15ఏళ్ల వయసున్న యువతీ యువకులపై మూడోదశ ప్రయోగాలు చేపట్టింది. అనంతరం వారిలో 100శాతం సమర్థత చూపించడంతో పాటు బలమైన యాంటీబాడీ ప్రతిస్పందనలు గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో 12-15ఏళ్ల వయసు వారికీ వ్యాక్సిన్‌ అనుమతి కోసం త్వరలోనే ఎఫ్‌డీఐని సంప్రదిస్తామని ఫైజర్‌ ప్రకటించింది.

ఇక ఈ 12-15 సంవత్సరాల వయసు వారిపైనే కాకుండా 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు చిన్నారులపై వ్యాక్సిన్‌ ప్రయోగాలను ఫైజర్‌ ఈమధ్యే మొదలుపెట్టింది. వీరితో పాటే మరికొన్ని వారాల్లోనే ఐదేళ్లలోపు చిన్నారులకు క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తోన్న చాలా వ్యాక్సిన్లు 18ఏళ్ల వయసుపైబడిన వారికి ఇవ్వడానికే అనుమతి ఉంది. చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకొచ్చేందుకు పలు దేశాల్లో ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని