ఫైజర్‌ టీకాకు 97శాతం ప్రభావశీలత!

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 97శాతం ప్రభావశీలత కనిపించిందని వెల్లడైంది.

Published : 12 Mar 2021 01:13 IST

వాస్తవ ఫలితాల్లో వెల్లడి

బెర్లిన్‌: ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 97శాతం ప్రభావశీలత కనిపించిందని వెల్లడైంది. వ్యాక్సిన్ సమర్థతపై ప్రయోగ ఫలితాలు ఇప్పటికే వెల్లడైనప్పటికీ, లక్షణాలున్న రోగుల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఫార్మా కంపెనీల విశ్లేషణలో తేలింది.

ఇజ్రాయెల్‌లో భారీ స్థాయిలో చేపట్టిన వ్యాక్సినేషన్‌లో ఫైజర్‌ టీకాను అందిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 40శాతం మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఇందులో భాగంగా జనవరి 17 నుంచి మార్చి 6వరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సమాచారాన్ని విశ్లేషించారు. ఇందులో లక్షణాలు లేని కరోనా కేసుల్లో 94శాతం సమర్థత కనబరిచినట్లు ఇప్పటికే వెల్లడైంది. ప్రస్తుతం లక్షణాలు కనిపించిన వారిలోనూ 97శాతం ప్రభావశీలత ఉన్నట్లు తేలింది. అంతకు ముందు డిసెంబర్‌లో జరిపిన విశ్లేషణల్లోనూ ఇదే తరహా ఫలితాలు కనిపించినట్లు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోన్న సమయంలో తాజా ఫలితాలు ఎంతో కీలకమని వ్యాక్సిన్‌ కంపెనీలు పేర్కొన్నాయి.

ఆరు దేశాల్లో నిలిచిన టీకా పంపిణీ..

కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలో వందకుపైగా దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే, వ్యాక్సిన్‌ దుష్ఫలితాలు చూపిస్తున్నాయన్న కారణంతో కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని నిలిపివేశాయి. ఇలా ఇప్పటివరకు ఆరు దేశాల్లో టీకా పంపిణీ నిలిచిపోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకడుతున్నట్లు తాజాగా డెన్మార్క్‌లో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అక్కడ పంపిణీ చేస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డెన్మార్క్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రక్తం గడ్డకట్టడానికి వ్యాక్సిన్‌ కారణమా అనే అంశంపై స్పష్టత రాలేదని పేర్కొంది. ప్రస్తుతం వీటిని సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారని, అందుకే తాత్కాలికంగా వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు ఆస్ట్రియాతో పాటు ఎస్తోనియా, లాట్వియా, లిథ్వేనియా, లుక్సెంబర్గ్‌ దేశాలు తాత్కాలికంగా వ్యాక్సిన్‌ పంపిణీని నిలిపివేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని