సమర్థవంతంగా కొవాగ్జిన్‌: లాన్సెట్‌ పరిశీలన

భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ మొదటిదశ ప్రయోగాల్లోనే మెరుగైన ఫలితాలను నమోదు చేసి, రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో తోడ్పడుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

Published : 22 Jan 2021 17:30 IST

రోగనిరోధక శక్తి పెంచడంలో మెరుగైన ఫలితాలు

దిల్లీ: భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ మొదటిదశ ప్రయోగాల్లోనే మెరుగైన ఫలితాలను నమోదు చేసి, రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో తోడ్పడుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలు లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్‌కు భారత ప్రభుత్వం నుంచి అత్యవసర వినియోగ అనుమతి కూడా లభించింది. అయితే వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాల్లో ఉన్న సమయంలోనే దీనికి అత్యవసర వినియోగ అనుమతి లభించడంపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధక పత్రాలు వ్యాక్సిన్ సమర్థతను తెలుపుతున్నాయి.

పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొవాగ్జిన్‌ మొదటిదశ ప్రయోగాలను దేశవ్యాప్తంగా 11 ఆస్పత్రుల్లో నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 55ఏళ్ల వయసున్నవారు ఈ మొదటిదశ ప్రయోగాల్లో పాల్గొన్నారు. గతేడాది జులై 13 నుంచి 30 వరకు 827మంది వాలంటీర్లు నమోదు చేసుకోగా, వారిలో 375 మందిని పరీక్షల కోసం ఎంచుకున్నారు. అందులో మూడు వందల మందిని వయసు ఆధారంగా మూడు గ్రూపులుగా మార్చారు. మరో 75 మందిని కంట్రోల్‌ గ్రూప్‌గా ఉంచారు. వీరందరికీ 14 రోజుల తేడాతో రెండు వ్యాక్సిన్‌ డోసులను అందించారు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్‌ విషయంలో ఎటువంటి దుష్ప్రభావాలు ఎదురవలేదన్నారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత వచ్చే చిన్న చిన్న సమస్యలు మినహా ఎటువంటి ఘటనలు నమోదవ్వలేదని తెలిపారు. ఈ ప్రయోగాల్లో అన్ని వయసుల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుదలను గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన ఎటువంటి సమస్యలు వారిలో తలెత్తలేదని తెలిపారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన ప్రాంతంలో కొద్దిగా నొప్పి ఉందని, కొందరికి తలనొప్పి, అలసట, జ్వరం వంటి వాటిని గుర్తించామన్నారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఇవన్నీ రావడం చాలా సాధారణమని వారు తెలిపారు.

ఇది వైరల్‌ ప్రొటీన్లను శరీరంలోకి విడుదల చేసి, వైరస్‌ మానవ కణాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని వారు తెలిపారు. మూడు వారాల విరామంతో కొవాగ్జిన్‌ రెండో డోసు తీసుకోవడం ద్వారా ఈ వైరల్‌ ప్రొటీన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి వైరస్‌తో పోరాడతాయన్నారు. ఈ వ్యాక్సిన్లను వారంరోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయొచ్చని తయారీదారు భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

ఇవీ చదవండి..

కొవిడ్‌ టీకాపై భయం తొలగించాలి

కరోనాపై యుద్ధంలో బైడెన్‌ అస్త్రాలివే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని