BrahMos missile: ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ క్షిపణులు.. ₹2800 కోట్లతో ఒప్పందం

భారత్​-ఫిలిప్పీన్స్​ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఆ దేశ నౌకాదళానికి భారత్​ తాము రూపొందించిన బ్రహ్మోస్​ సూపర్​సోనిక్​ యాంటీషిప్​ క్రూయిజ్​ క్షిపణులను విక్రయించనుంది.......

Published : 28 Jan 2022 18:00 IST

దిల్లీ: రక్షణ రంగంలో ఆయుధాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆనవాయితీకి స్వస్తి పలుకుతూ.. భారత్‌ ఇప్పుడు అత్యంత నాణ్యతతో స్వదేశంలోనే ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. తయారు చేసుకోవడమే కాదు.. ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలని కూడా భావిస్తోంది. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడ్డాయి. భారత్​-ఫిలిప్పీన్స్​ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఆ దేశ నౌకాదళానికి భారత్​ తాము రూపొందించిన బ్రహ్మోస్​ సూపర్​సోనిక్​ యాంటీషిప్​ క్రూయిజ్​ క్షిపణులను విక్రయించనుంది. ఈ ఒప్పందం​ విలువ 375 మిలియన్​ డాలర్లు. భారత కరెన్సీలో ₹2,800 కోట్లకుపైనే.

‘ఫిలిప్పీన్స్‌కు యాంటీ షిప్ మిస్సైల్ సిస్టమ్‌ను సరఫరా చేసేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఏపీఎల్) జనవరి 28న రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ సీఈఓ అతుల్​ డి. రాణె, డిప్యూటీ సీఈఓ సంజీవ్​ జోషీ, లెఫ్టినెంట్​ కల్నల్​ ఆర్​ నేగి, ప్రవీణ్​ పాఠక్​ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి 400 కిలోమీటర్లలోపు ఉండే లక్ష్యాన్నైనా చేధించేలా బ్రహ్మోస్‌ క్షిపణుల రకాలను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆయా క్షిపణులను మరింత మెరుగుపెట్టేలా సన్నద్ధతను పరీక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని