Viral Pic:.. కావాలంటే నన్ను చంపేయండి!

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కొందరు నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి నల్లటి దుస్తులు ధరించిన కొందరు పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్‌ చేయడం.. మాట వినకపోతే తూటాకు పనిచెప్పడమ..........

Published : 09 Mar 2021 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కొందరు నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి నల్లటి దుస్తులు ధరించిన కొందరు పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్‌ చేయడం.. మాట వినకపోతే తూటాకు పనిచెప్పడమే వారి లక్ష్యం. వారిని చూసి అక్కడి యువకులు పరుగులు పెడుతున్నారు. అప్పటికే ఓ వ్యక్తి తూటాకు బలయ్యాడు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేసినా మరింతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె గ్రహించింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెల్లటి దుస్తులు ధరించిన ఓ సన్యాసిని పోలీసులకు ఎదురెళ్లింది. నిగ్రహం పాటించండి అంటూ శాంతి వచనాలు పలికింది. అయినా ఆమె మాటల్ని లెక్కచేయకుండా ముందుకు కదులుతున్నారు ఆ పోలీసులు. దీంతో ఆమె వెంటనే మోకాలిపై కూలబడింది. ‘ఆందోళనకారులను ఏమీ చేయొద్దు.. కావాలంటే నా ప్రాణం తీసుకోండి’ అంటూ వేడుకుంది. మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్న ఈ చిత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. కచిన్‌ రాష్ట్రంలో మైత్‌క్వీనా నగరంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని నిరసిస్తూ కొద్ది రోజులుగా ప్రజాస్వామ్యవాదులు మయన్మార్‌లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. వారిని అణచివేసేందుకు సైన్యం తూటాలకు పనిచెబుతోంది. ఇప్పటి వరకు సుమారు 60 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. మైత్‌క్వీనాలో సోమవారం సైతం ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు నచ్చజెప్పేందుకు సిస్టర్‌ అన్న్‌ రోజ్‌ ను తవాంగ్‌ ప్రయత్నించారు. వారిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్తున్న పోలీసులను అడ్డుగా నిలిచారు. వారినేమీ చేయొద్దంటూ మోకాలిపై నిలబడి వేడుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది. ఇద్దరు పోలీసులు సైతం ఆమెకు చేతులు జోడించి నమస్కరించడం కనిపించింది. ఫిబ్రవరి 28న సైతం నిరసనకారులపై ప్రతాపం చూపేందుకు వచ్చిన పోలీసులను ఇలానే అడ్డుకున్నారు సిస్టర్‌ తవాంగ్‌. సోమవారం నాటి ఘటనపై సిస్టర్‌ తవాంగ్‌ మాట్లాడుతూ.. ఆ సమయంలో ప్రపంచం కుప్పకూలుతున్నట్లు అనిపించిందని చెప్పారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎదురెళ్లడంపై ‘ఫిబ్రవరి 28నే నా ప్రాణాలు పోయానని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, సోమవారం నాటి ఘటనలో ఇద్దరు మరణించినట్లు అక్కడి రెస్య్కూ టీమ్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని