Supreme Court: పార్లమెంటు భవనం ప్రారంభ వివాదం.. సుప్రీం కోర్టులో పిల్‌!

పార్లమెంటు నూతన భవన (New Parliament Building) ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Published : 25 May 2023 15:13 IST

దిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై (New Parliament Building) ప్రభుత్వం, విపక్షాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. తాజాగా ఈ అంశం సుప్రీం కోర్టుకు (Supreme Court) చేరింది. మే 28న పార్లమెంటు కొత్త భవన ప్రారంభం రాష్ట్రపతి (President of India) చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని అందులో పేర్కొన్నారు.

‘ప్రధానమంత్రి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని సలహాతో ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్‌, యూపీఎస్‌సీ ఛైర్మన్‌, సీఈసీ, ఫైనాన్షియల్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. అటువంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది’ అని న్యాయవాది జయా సుఖిన్‌ దాఖలు చేసిన పిల్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అక్రమం, ఏకపక్షం, అధికార దుర్వినియోగం, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసులో లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్ర హోంశాఖతోపాటు న్యాయశాఖను పార్టీలుగా చేర్చారు.

స్వీయ ప్రచారం కోసమే..

పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై కాంగ్రెస్‌ పార్టీ తన విమర్శలకు ఎక్కుపెట్టింది. స్వీయ ప్రచారం చేసుకోవాలనే కోరికతోనే తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిని దూరం పెట్టారని మండిపడింది. కేంద్ర ప్రభుత్వ అహంకారపూరిత విధానం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని