Pinarayi Vijayan: రాష్ట్ర మంత్రిని కువైట్‌ వెళ్లొద్దనటం.. సమాఖ్య సూత్రాలకు విరుద్ధం

కువైట్‌లోని మంగాఫ్‌ నగరంలో 46 మంది భారతీయులను బలిగొన్న భారీ అగ్నిప్రమాదం మృతుల్లో 24 మంది కేరళవాసులు ఉన్నప్పటికీ.. సహాయక చర్యల సమన్వయానికి రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జి అక్కడికి వెళ్లేందుకు కేంద్రం అనుమతి నిరాకరించడం సహకార సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు.

Updated : 20 Jun 2024 06:22 IST

అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉండొద్దా? 
ప్రధాని మోదీకి కేరళ సీఎం విజయన్‌ లేఖ

తిరువనంతపురం: కువైట్‌లోని మంగాఫ్‌ నగరంలో 46 మంది భారతీయులను బలిగొన్న భారీ అగ్నిప్రమాదం మృతుల్లో 24 మంది కేరళవాసులు ఉన్నప్పటికీ.. సహాయక చర్యల సమన్వయానికి రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జి అక్కడికి వెళ్లేందుకు కేంద్రం అనుమతి నిరాకరించడం సహకార సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. జూన్‌ 15 తేదీతో ఉన్న ఈ లేఖను బుధవారం బహిర్గతపరిచారు. విదేశీ వ్యవహారాల శాఖ తమ వినతికి స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇటువంటి విషయాల్లో మరింత బాధ్యతాయుతంగా ఉండేలా ఆ శాఖకు ప్రధాని సలహా ఇవ్వాలని విజయన్‌ కోరారు. ఆ సమయంలో రాష్ట్ర మంత్రి అక్కడికి వెళితే అనూహ్యమైన విషాదానికి గురైన బాధిత కుటుంబాలకు ఎంతో మానసిక ఉపశమనం, విశ్వాసం కలిగేవన్నారు. కేంద్ర మంత్రిత్వశాఖ తీరును వివాదాస్పదం చేయడం తన ఉద్దేశం కాదని, విపత్కర పరిస్థితుల్లో రాజకీయ అనుమతులు సకాలంలో ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయంగా మిగిలిపోతాయనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకురావడమే తన అభిమతమన్నారు. ప్రజలు విపత్తులను ఎదుర్కొంటున్నపుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండరాదని విజయన్‌ లేఖలో పేర్కొన్నారు. కువైట్‌ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు బుధవారం కేరళ శాసనసభ సంతాపం తెలిపింది. 

మృతుల కుటుంబాలకు రూ.12.5 లక్షల చొప్పున సాయం

కువైట్‌ సిటీ: విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా జూన్‌ 12న తమ దేశంలోని ఏడంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు కువైట్‌ ప్రభుత్వం రూ.12.5 లక్షల (15,000 డాలర్లు) చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. ఆ భవనంలో నివసిస్తున్న 196 మంది వలస కార్మికుల్లో అత్యధికులు భారతీయులే. వారిలో 46 మంది ఈ అగ్నిప్రమాదంలో మృతిచెందారు. కువైట్‌ పాలకుడు షేక్‌ మేషల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జబేర్‌ అల్‌ సబాహ్‌ ఆదేశాల మేరకు ఈ సాయం ప్రకటించినట్లు ‘ది అరబ్‌ టైమ్స్‌’ పత్రిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని