Ukraine Crisis: 219 మందితో భారత్‌కు చేరుకున్న తొలి విమానం

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తొలి విమానం భారత్‌కు చేరుకుంది......

Published : 26 Feb 2022 21:50 IST

దిల్లీ: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తొలి విమానం భారత్‌కు చేరుకుంది. ఉక్రెయిన్‌ నుంచి రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో బయల్దేరిన తొలి విమానం స్వదేశానికి వచ్చేసింది. రొమేనియా రాజధాని నగరం బుకారెస్ట్‌ నుంచి బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం ఈరోజు సాయంత్రం ముంబయిలో ల్యాండ్‌ అయ్యింది. వచ్చిన వారికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ స్వాగతం పలికారు. ‘ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా స్వదేశానికి వచ్చిన వారి మోముల్లో నవ్వులు చూస్తే ఆనందంగా ఉంది. ప్రతి భారతీయుడి రక్షణ కోసం మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది’ అంటూ పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు.

రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మంది భారతీయులతో ఎయిర్​ ఇండియా విమానం అక్కడి నుంచి ముంబయికి బయల్దేరినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ శనివారం మధ్యాహ్నం వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలూ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశాలను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. భారతీయుల తరలింపులో సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్​ అరెస్కూకు జైశంకర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

బుకారెస్ట్‌ నుంచి బయల్దేరిన రెండో విమానం
ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో బుకారెస్ట్‌ నుంచి రెండో విమానం దిల్లీ బయల్దేరినట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ వెల్లడించారు. ఎయిరిండియా విమానంలో 250 మంది భారతీయులు దిల్లీకి చేరుకోనున్నట్టు పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని