Bypolls: నీతీశ్‌-తేజస్వీకి తొలి పరీక్ష.. పొత్తులో చిచ్చు తప్పదన్న పీకే

బిహార్‌లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, జేడీయూ మహాగట్‌బంధన్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న తొలి పోలింగ్‌ ఇదే. 

Updated : 03 Nov 2022 15:11 IST

పట్నా: బిహార్‌లో జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వం నేడు తొలి పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ రాష్ట్రంలో రెండు నియోజకవర్గాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. మోకమా, గోపాల్‌గంజ్‌ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. ఈ ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక ఫలితాలు మహాగట్‌బంధన్‌ కూటమిలో చిచ్చురేపుతాయని జోస్యం చెప్పారు.

‘‘జేడీయూపై ప్రజల్లో విశ్వాసం తగ్గింది. గత ఆరేళ్లుగా నీతీశ్‌జీ కూటములతో 10 ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఆర్జేడీ-జేడీయూ చేతులు కలిపి.. భాజపాకు గట్టి పోటీ ఇస్తున్నానని భావిస్తున్నారు. కానీ, ఆ కూటమిలో అంతర్గత విభేదాలు తప్పవు. ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత అవన్నీ బయటకు వస్తాయి’’ అని పీకే వ్యాఖ్యానించారు. గోపాల్‌గంజ్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుభాష్‌ సింగ్‌ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో భాజపా నుంచి సుభాష్‌ భార్య కుసుమా దేవీ పోటీ చేస్తుండగా మహాగట్‌బంధన్‌ తరఫున ఆర్జేడీ నేత మోహన్‌ గుప్తా బరిలో ఉన్నారు. మోకమాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌పై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ఆర్జేడీ తరఫున అనంత్‌ భార్య నీలిమా దేవి, భాజపా నుంచి సోనమ్‌ దేవీ పోటీ చేస్తున్నారు.

ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్‌..

బిహార్‌తో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు నేడు ఉపఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. తెలంగాణలోని మునుగోడు, మహారాష్ట్రలోని అంధేరీ(తూర్పు), హరియాణాలోని అదంపూర్‌, ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్‌, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో ఓటింగ్‌ కొనసాగుతోంది. నవంబరు 6న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని