Vaccination: బూస్టర్‌ డోసు, చిన్నారులకు టీకాపై కేంద్రం కీలక ప్రకటన

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. టీకాలు, బూస్టర్‌ డోసుల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేయడంపై కూడ అవి దృష్టి సారించాయి. ఇదే క్రమంలో భారత్‌ కూడ.. బూస్టర్‌ డోసులు, చిన్నారులకు టీకా విషయంలో...

Updated : 30 Nov 2021 17:26 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. టీకాలు, బూస్టర్‌ డోసుల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేయడంపై కూడా దృష్టి సారించాయి. ఇదే క్రమంలో భారత్‌ బూస్టర్‌ డోసులు, చిన్నారులకు టీకా విషయంలో కీలక ప్రకటన చేసింది. దేశంలో బూస్టర్‌, అదనపు డోసుల పంపిణీ విషయమై రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తామని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డా.ఎన్‌కె అరోడా సోమవారం వెల్లడించారు. అలాగే 44 కోట్ల మంది చిన్నారులకూ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఎన్‌టీఏజీఐ ఆధ్వర్యంలో..

‘బూస్టర్‌, అదనపు డోసుల పంపిణీ విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్‌టీఏజీఐ) రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని తీసుకురానుంది. ఎవరికి ఈ డోసులు అవసరం? ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? తదితర విషయాలను ఇందులో పొందుపర్చనుంది. ప్రస్తుతం కొత్త వేరియంట్‌ కూడా వెలుగులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో దాని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని అరోరా చెప్పారు.

అనారోగ్య చిన్నారులకు ప్రాధాన్యం..

చిన్నారులకు వ్యాక్సినేషన్‌ విషయమై మాట్లాడుతూ.. ‘18 ఏళ్లలోపు ఉన్న 44 కోట్ల మందికి టీకాలు వేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాం. దీన్ని త్వరలోనే ప్రకటిస్తాం. అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు ప్రాధాన్యం ఉంటుంది. జైకోవ్‌-డీ, కొవాగ్జిన్‌, కార్బివ్యాక్స్‌ టీకాలు వేస్తాం. అందరికీ సరిపడా డోసులు అందుబాటులో ఉన్నాయి’ అని వెల్లడించారు.

బూస్టర్‌ డోసు.. అదనపు డోసు.. ఏంటీ తేడా?

బూస్టర్‌ డోసు, అదనపు డోసు మధ్య తేడా ఉందని డా.అరోడా వివరించారు. ‘రెండు డోసుల అనంతరం నిర్ణీత వ్యవధిలో బూస్టర్‌ డోసు ఇస్తారు. రెండు డోసులు వేయించుకున్న తర్వాత కూడా రోగనిరోధక శక్తిలేని వారికి మాత్రమే ఇచ్చేది అదనపు డోసు’ అని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని