Simultaneous polls: ‘జమిలి’పై కోవింద్‌ కమిటీ నివేదిక.. త్వరలో క్యాబినెట్‌ ముందుకు!

‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ (Simultaneous polls) సాధ్యాసాధ్యాలపై కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదిక త్వరలోనే కేంద్ర క్యాబినెట్‌ ముందుకురానుంది.

Published : 14 Jun 2024 18:32 IST

దిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ (Simultaneous polls) సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక త్వరలోనే కేంద్ర క్యాబినెట్‌ ముందుకురానుంది. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ సంసిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 100 రోజుల అజెండాలో భాగంగా దీన్ని సాధ్యమైనంత తొందరగా క్యాబినెట్‌ ముందు ఉంచనున్నట్లు తెలిపాయి. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి వంద రోజుల్లో చేపట్టే కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలని లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రధాని మోదీ అన్ని శాఖలకు సూచించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే న్యాయశాఖలోని శాసన విభాగం సిద్ధమవుతోంది.

జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ.. ఈ ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కు నివేదిక అందించింది. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని అందులో సిఫార్సు చేసింది. వీటితోపాటు మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటరు కార్డులను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది.

భాజపాపై ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్రు.. భాగవత్‌తో భేటీ కానున్న యోగి..!

మరోవైపు ఇదే అంశంపై అటు న్యాయశాఖ కూడా త్వరలోనే తన నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. లోక్‌సభ, అసెంబ్లీలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచించనున్నట్లు తెలుస్తోంది. వీటిని 2029 నుంచి అమలుచేయాలని, ఒకవేళ హంగ్ ప్రభుత్వం లేదా అవిశ్వాసం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏకీకృత ప్రభుత్వం కోసం నిబంధనను సిఫార్సు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని