Supreme Court: రాహుల్‌పై అనర్హత వేళ.. సుప్రీంలో కీలక పిటిషన్‌

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నిబంధన కిందనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi disqualification)పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది.

Published : 25 Mar 2023 12:41 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేళ సుప్రీంకోర్టు (Supreme Court)లో కీలక పిటిషన్‌ దాఖలైంది. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆటోమేటిక్‌గా అనర్హులు (disqualification)గా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ సామాజిక కార్యకర్త అభా మురళీధరన్‌ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఈ పిటిషన్ వేశారు. (Rahul Gandhi disqualification)

ప్రజా ప్రాతినిధ్య (Representation of People Act) చట్టంలోని సెక్షన్ 8(3) కింద.. దోషిగా తేలిన ప్రజాప్రతినిధిని ఆటోమేటిక్‌గా అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్‌ ఆరోపించారు.  సంబంధిత సభ్యునిపై ఉన్న నేరాల స్వభావం, తీవ్రతతో సంబంధం లేకుండానే ఆయనపై అనర్హతను అమలు చేయడం రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన "ఆటోమేటిక్" అనర్హత పై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. రాహుల్‌ (Rahul Gandhi)పై అనర్హత వేటు పడిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతకుముందు దోషిగా తేలిన ప్రజాప్రతినిధులపై అనర్హత (disqualification) వేటు వేసే ముందు మూడు నెలల సమయం ఇచ్చేవారు. ఆలోపు పై కోర్టులలో అప్పీలు చేసుకోవచ్చు. న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకునే వరకు వారిపై వేటు పడేది కాదు. అయితే ఈ నిబంధనపై గతంలో సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టేసింది. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951లో సవరణలు చేశారు. ఆ సవరణల ప్రకారమే తాజాగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని