Published : 14 Nov 2021 01:21 IST

Covid Cases: కొవిడ్‌తో జర్మనీ విలవిల.. గరిష్ఠానికి ఇన్‌ఫెక్షన్‌ రేటు!

బెర్లిన్: యూరప్‌లో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జర్మనీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ సంఖ్యలో బాధితులతో ఇక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో ఈ రేటు లక్ష మందికిగానూ 277.4గా నమోదైంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇదే అత్యధికం. జర్మన్‌ ప్రభుత్వ సంస్థ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్(ఆర్‌కేఐ) ఈ గణాంకాలు వెల్లడించింది. గత వారమే ఈ రేటు 201.1గా ఉండగా, అతి తక్కువ సమయంలోనే 277కు చేరుకోవడం స్థానికంగా కొవిడ్‌ తీవ్రతకు అద్దం పడుతోంది! అంతకుముందు గతేడాది డిసెంబర్‌ 22న 197.6గా నమోదైంది. మరోవైపు రోజువారీ కేసులు మరోసారి 50 వేలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 235 మంది మృతి చెందినట్లు ఆర్‌కేఐ వెల్లడించింది. సాక్సోని, తురింగియా, బవేరియాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది.

టీకా వేయించుకోవాలని మెర్కెల్‌ విజ్ఞప్తి

దేశంలో ఇన్‌ఫెక్షన్‌ రేటు భారీగా పెరగడంపై జర్మన్ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇప్పటివరకు టీకాలు తీసుకోని వారు అత్యవసరంగా తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక వివరాల ప్రకారం.. జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో 40 శాతం మందికి మాత్రమే రెండు డోసులు పూర్తయ్యాయి. ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ సైతం దేశంలో మహమ్మారి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైరస్‌ కట్టడి విషయమై మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని, వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తామని, ఇండోర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మరోవైపు.. దేశంలో కరోనా పరిస్థితులను నియంత్రించేందుకుగానూ ఫెడరల్ ప్రభుత్వం వచ్చేవారం స్థానిక 16 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం కానుంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని