Kharge: మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం

కాంగ్రెస్‌ను ‘పరాన్న జీవి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. 2021లో రైతులు నిరసన చేపట్టినప్పుడు అదే మాట అన్నారని, మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారన్నారు.

Updated : 03 Jul 2024 14:37 IST

దిల్లీ: లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi)వి పిల్ల చేష్టలు (బాలక్‌ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ అన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. లోక్‌సభలో మంగళవారం ప్రధాని(PM Narendra Modi) మాట్లాడుతూ.. విపక్ష నేత రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు (బాలక్‌ బుద్ధి) అని ఎద్దేవా చేశారు.  కేవలం సానుభూతి పొందడం కోసమే సభలో కాంగ్రెస్‌ కొత్త నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.

‘‘దేశంలో ఆర్థిక అరాచకత్వం సృష్టించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఓటమిని అంగీకరించకుండా అహంకారంతో ప్రవర్తిస్తోంది. ఓబీసీలను దొంగలుగా సంబోధించినందుకు వారికి శిక్ష పడింది. దేశ అత్యున్నత న్యాయస్థానంపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు వారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సందర్భానికి తగ్గట్లు స్వరం మార్చే అలాంటి నేత (రాహుల్‌గాంధీని ఉద్దేశించి) ఇలాంటి అరాచకమైన మార్గాన్ని ఎంచుకోవడం.. దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయడమే. వారి మాటతీరు, వ్యవహారశైలి బాగా లేదు. సభలో ఉన్నట్టుండి ఎవరివద్దకో వెళ్లి కౌగిలించుకుంటారు... లేదంటే సభలో కూర్చొని కన్ను కొడతారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీకి అనుభవజ్ఞులైన నాయకులున్నా అరాచక, అబద్ధాల రహదారిపై వెళ్లాలనుకోవడం అత్యంత ఆందోళనకరం. అందుకే వారితో ఒరిగేదేమీ లేదని ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు’’ అని మోదీ అన్నారు.

దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ... ఈ ఎన్నికల్లో 140 కోట్ల మంది భారతీయులు మీతో ఒరిగిందేమీ లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తెలియజేశారని విమర్శించాయి.

కాంగ్రెస్‌ను ‘పరాన్న జీవి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘2020-21లో రైతుల నిరసన సమయంలో వారిని ఉద్దేశించి మోదీ అదే పదాన్ని ఉపయోగించారు. ఈ రోజు కాంగ్రెస్‌ను అలాగే అవమానిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 140 కోట్ల మంది భారతీయులు మీ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదని చెప్పకనే చెప్పారు. మోదీజీ మీరు ముందు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోండి. నియంతృత్వాన్ని వదిలివేయండి!’’ అని కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) స్పందిస్తూ.. ‘‘నీట్‌పై ఎవరూ ప్రశ్నలు వేయకూడదని ప్రధాని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. పిల్ల చేష్టలు అని మాట్లాడేవారే పిల్ల చేష్టలు చేస్తుంటారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న నాయకుల గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని వారికి తెలియదు. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికీ ఎంతోమంది చేతకాని పిల్లలు ఉన్నారు. వారు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోలేరు’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని