PM Modi: జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పెంచండి.. ప్రధాని మోదీ సూచన

దేశవ్యాప్తంగా  కొవిడ్‌ (Covid 19) ఉద్ధృతి, ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేసిన ఆయన.. వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కూడా పెంచాలని ఆదేశించారు.

Updated : 22 Mar 2023 21:52 IST

దిల్లీ: గడిచిన రెండు వారాలుగా దేశంలో కొవిడ్‌ (Covid 19) ఉద్ధృతి, ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యవ్యవస్థ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్న దృష్ట్యా.. ల్యాబ్‌ టెస్టులు, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ (Genome Sequencing)తోపాటు అన్ని రకాల శ్వాసకోశ జబ్బులకు సంబంధించి పరీక్షలను మరింతగా పెంచాలని సూచించారు. వ్యాధి నివారణ చర్యలతోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటించడం, ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌లు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

దేశంలో కొవిడ్‌ విజృంభణ, ఇన్‌ఫెక్షన్ల తీరుతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ఈ సమీక్షా సమావేశంలో వివరించారు. దేశంలో ప్రతివారం సరాసరి 888 కేసులు నమోదవుతున్నాయని.. పాజిటివిటీ రేటు కూడా 0.98శాతంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతివారం సుమారు లక్ష కేసులు నమోదవుతున్నాయన్నారు. కొన్ని నెలలుగా దేశంలో హెచ్‌1ఎన్‌1తోపాటు హెచ్‌3ఎన్‌2 కేసులు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్న దృష్ట్యా కొవిడ్‌ పాజిటివిటీ నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను పెంచాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. తద్వారా కొత్త వేరియంట్లను గుర్తించే వీలుంటుందని.. ఆ వెంటనే ప్రతిస్పందించడం సాధ్యమవుతుందన్నారు. శ్వాసకోశ కేసులను పర్యవేక్షించడంతోపాటు ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు. వీటికి సంబంధించిన ఔషధాలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్‌ మహమ్మారి ముగియడం ఇప్పట్లో లేదని.. దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌తోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటించడం వంటి ఐదంచెల వ్యూహంపై ఎల్లప్పుడూ దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఆస్పత్రి పరిసరాల్లో వైద్య సిబ్బందితోపాటు రోగులు, ఆరోగ్య కార్యకర్తలు మాస్కులు ధరించడం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు రద్దీ ప్రదేశాల్లోనూ మాస్కులు ధరించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని