Published : 30 Jan 2022 14:20 IST

Mann Ki Baat: అమర్‌ జవాన్‌ జ్యోతి మాదిరే.. అమరుల స్ఫూర్తి శాశ్వతం

ఈ ఏడాది తొలి ‘మన్‌కీ బాత్‌’ ప్రసంగంలో ప్రధాన నరేంద్ర మోదీ

దిల్లీ: అమర్‌ జవాన్‌ జ్యోతి జ్వాల మాదిరే.. అమరవీరుల త్యాగాలు, స్ఫూర్తి శాశ్వతమని ప్రధాన నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల ఇండియా గేట్ వద్ద సుభాష్‌ చంద్ర బోస్‌ హోలోగ్రాం విగ్రహం ఆవిష్కరణ, అమర్ జవాన్ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకం(నేషనల్ వార్ మెమోరియల్‌) వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేయడం ఘట్టాలను గుర్తుచేస్తూ..  దేశం ఇప్పుడు తన జాతీయ చిహ్నాలను గౌరవించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. అమర్ జవాన్ జ్యోతి.. అమరవీరుల త్యాగానికి చిహ్నమని పేర్కొంటూ పలువురు తనకు లేఖలు రాశారని వెల్లడించారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించాలంటూ పౌరులను కోరారు.

* నేడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూజీకి నివాళులర్పించారు. జాతిపిత ఆదర్శాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని.. దేశ సాయుధ దళాల సిబ్బంది త్యాగాలను గుర్తుచేసుకున్నారు. గాంధీ వర్ధంతిని ఏటా అమరవీరుల దినోత్సవంగా పాటిస్తారు.

* ఆయా రంగాల్లో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులు పొందిన బసంతీ దేవి(ఉత్తరాఖండ్‌), లోరెంబమ్ బెయినో దేవి(మణిపూర్‌) తదితరులను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వారిని ‘అన్‌సంగ్ హీరోలు’గా అభివర్ణిస్తూ.. వారి సేవలను కొనియాడారు.

* దేశంలో అవినీతిని రూపుమాపేందుకు యువత కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. విద్య ఆవశ్యకతను వివరిస్తూ.. సమాజంలోని ప్రతి స్థాయిలో చదువు పట్ల అవగాహన కనిపిస్తోందన్నారు.

* ప్రకృతిని ప్రేమించడం, ప్రతి జీవి పట్ల దయతో వ్యవహరించడం భారతీయ సంస్కృతిలో భాగమని ప్రధాని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ‘కాలర్‌ వాలీ’ పులికి అటవీ శాఖ అధికారులు తుది వీడ్కోలు పలికిన తీరును గుర్తుచేశారు. అలాగే, రాష్ట్రపతి అంగరక్షక దళంలోని అశ్వం ‘విరాట్’ వీడ్కోలనూ ప్రస్తావించారు.

* మహమ్మారి మూడో వేవ్‌తో దేశం విజయవంతంగా పోరాడుతోందని ప్రధాని తెలిపారు. ఇప్పటివరకు 4.5 కోట్ల మందికి పైగా పిల్లలు టీకాలు పొందారని చెప్పారు. ఇదిలా ఉండగా.. నేటి ‘మన్‌కీ బాత్‌’ 85వ ఏపిసోడ్‌ కాగా, ఈ ఏడాదిలో మొదటిది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని