PM Narendra Modi: ప్రపంచశాంతికి తీవ్రవాదం అడ్డుకట్ట వేస్తోంది

తజకిస్థాన్‌ రాజధాని దుషన్‌బేలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు

Published : 17 Sep 2021 17:39 IST

దుషన్‌బే: పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాల్‌గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాంతి భద్రతలతో దేశాల మధ్య నమ్మకాన్ని నెలకొల్పే విషయంలో తీవ్రవాదం పెద్ద సమస్యగా నిలిచిందన్నారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిణామాలు తీవ్రవాదాన్ని బలపరిచేలా స్పష్టంగా ఉన్నాయన్నారు. తజకిస్థాన్‌ రాజధాని దుషన్‌బేలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈమేరకు సభ్యదేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశాలను నిలువరించాలని పిలుపునిచ్చారు. ఎస్‌సీవోలో కొత్తగా చేరుతున్న ఇరాన్‌, సౌదీ అరేబియా, ఈజిప్ట్, కతర్‌ దేశాలకు ఆయన స్వాగతం పలికారు.

గత కొన్నేళ్లుగా భారత్‌ పోరాడుతున్న ప్రాంతీయ స్థిరత్వంపైనా ఆయన ప్రస్తావించారు. దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలపై కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని చైనా, పాకిస్థాన్‌తో సహా మిగిలిన సభ్య దేశాలను కోరారు. ఇరవై ఏళ్ల తర్వాత అఫ్గాన్‌ నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవడంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్, చైనా తాలిబన్ల పాలనలో పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. గతంలో అఫ్గానిస్థాన్‌లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్‌ చేపట్టిందని మోదీ గుర్తు చేశారు. అఫ్గాన్‌ను ఉపయోగించుకుని పాకిస్థాన్‌ కేంద్రంగా ఉన్న లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలతో జమ్మూకశ్మీర్‌లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని