Published : 24 Feb 2021 23:36 IST

పీఎం-కిసాన్‌: రూ.1.15లక్షల కోట్లు బదిలీ!

వెల్లడించిన కేంద్ర వ్యవసాయశాఖ

దిల్లీ: పీఎం-కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1.15లక్షల కోట్లను రైతులకు బదిలీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం వల్ల పదికోట్ల మంది రైతులు లబ్దిపొందినట్లు పేర్కొంది. అయితే, అర్హత కలిగిన రైతులందరినీ ఈ పథకంలో చేర్చాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పీఎం-కిసాన్‌ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ వివరాలు వెల్లడించారు.

రైతులకు ప్రయోజనం చేసేందుకు కేంద్రప్రభుత్వం పీఎం-కిసాన్‌ పేరుతో ఫిబ్రవరి, 2019న పథకం ప్రారంభించింది. దీనికింద ఏడాదికి రూ. 6వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే మూడు దఫాల్లో జమచేస్తోంది. ఈ పథకం ద్వారా 10.75కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందగా, ఇప్పటివరకు రూ.1.15లక్షల కోట్లను వారి ఖాతాల్లో జమచేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ థోమర్ వెల్లడించారు. దాదాపు 14.5కోట్ల మంది రైతులకు పీఎం-కిసాన్‌ ద్వారా ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని..మరింత మంది లబ్దిదారులను చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

పలుచోట్ల తమకు ఈ ప్రయోజనం అందడం లేదంటూ ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో, అర్హత కలిగిన రైతులను ఈ పథకంలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాష్ట్రాలకు సూచించారు. ఈ పథకం కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిందని, అందుచేత ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ పథకంలో పశ్చిమ బెంగాల్‌ చేరనప్పటికీ లబ్ధిదారుల సమాచారాన్ని కేంద్రానికి అందించిన అనంతరం వారికి కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తోన్న సమయంలోనూ వ్యవసాయ రంగం రాణించిందని కేంద్రమంత్రి తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని