Modi-Biden: బైడెన్‌తో భేటీ కానున్న మోదీ.. రష్యాతో వాణిజ్య సంబంధాలపై చర్చ!

అమెరికా అధ్యక్షుడు జో బెడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా భేటీ కానున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది......

Published : 11 Apr 2022 02:07 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బెడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా భేటీ కానున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్న రష్యాతో వాణిజ్య సంబంధాలకు భారత్‌ దూరంగా ఉండాలని పదేపదే అగ్రరాజ్యం సూచిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దక్షిణాసియాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతం సహా పలు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు’ అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ప్రధాన నేతల భేటీ అనంతరం.. ఇరు దేశాలకు చెందిన ఇద్దరు చొప్పున మంత్రులు సైతం చర్చల్లో పాల్గొననున్నారు. భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌.. అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చర్చలు సాగించనున్నారు.

రష్యాకు దూరం జరగాలి..

రష్యాకు, అలీనోద్యమానికి భారత్‌ దూరం జరగాలని తాము కోరుకుంటున్నట్లు అమెరికాలో జో బైడెన్‌ సర్కారు శనివారం పేర్కొంది. భారత్, అమెరికా మధ్య రక్షణ వాణిజ్యం అద్భుతంగా ముందుకు సాగుతోందని పేర్కొంది. దీన్ని మరింత పెంచుకోవడానికి  అవకాశాలు ఉన్నాయని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సుసంపన్నత, భద్రతకు ఇది కీలకమని వివరించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ వెండీ షెర్మన్‌.. కాంగ్రెస్‌లోని శక్తిమంతమైన విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు