Vikram-S: ఇదో చారిత్రక క్షణం.. దేశానికి గర్వకారణం: రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు

దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌(Vikram-S)ను శ్రీహరి కోటలోని షార్‌ నుంచి నింగిలోకి విజయవంతంగా ప్రయోగించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.

Published : 18 Nov 2022 21:28 IST

దిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌(Vikram-S)ను శ్రీహరి కోటలోని షార్‌ నుంచి నింగిలోకి విజయవంతంగా ప్రయోగించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు. భారత ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమ ప్రయాణంలో దీన్నొక కీలక మైలు రాయిగా అభివర్ణించారు. ఈ ప్రయోగానికి కృషిచేసిన శాస్త్రవేత్తలందరినీ అభినందిస్తూ వేర్వేరుగా ట్వీట్లు చేశారు. 

‘‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ ఈరోజు శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లడం భారతదేశానికి ఓ చారిత్రక క్షణం. దేశ ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఫీట్‌ను సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

అలాగే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం ట్విటర్‌లో స్పందించారు. నింగిలోకి విజయవంతంగా రాకెట్‌ దూసుకెళ్లిన క్షణాలు దేశానికి గర్వకారణమన్నారు. భారతదేశ తొలి ప్రైవేటు రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ విజయవంతంగా ప్రయోగించడం పట్ల ఆమె హర్షం ప్రకటించారు. ఇది మన ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమలో భారతదేశ శాస్త్రీయ పరాక్రమాన్ని, సమర్థతలను చాటుతోందని ప్రశంసించారు.

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ విక్రమ్‌-సబ్‌ ఆర్బిటల్‌ (వీకేఎస్‌) పేరుతో రూపొందించిన ప్రైవేటు రాకెట్‌ను ‘మిషన్‌ ప్రారంభ్‌’ పేరిట తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి శుక్రవారం ఉదయం నింగిలోకి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని