Modi: రోమ్‌లో మోదీ.. 12 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్లిన తొలి ప్రధాని 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ పర్యటనకు వెళ్లారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు నిన్న రాత్రి దిల్లీ నుంచి బయల్దేరిన మోదీ.. ఈ ఉదయం రోమ్‌ చేరుకున్నారు

Updated : 29 Oct 2021 10:43 IST

రోమ్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ పర్యటనకు వెళ్లారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు నిన్న రాత్రి దిల్లీ నుంచి బయల్దేరిన మోదీ.. ఈ ఉదయం రోమ్‌ చేరుకున్నారు. నేటి నుంచి అక్టోబరు 31 వరకు రోమ్‌, వాటికన్‌ సిటీ నగరాల్లో ప్రధాని పర్యటించనున్నారు. కాగా.. దాదాపు 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని ఈయనే అని ఇటలీలోని భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు. 

పర్యటనలో భాగంగా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మధ్యాహ్నం వెన్యూ పియాజా గాంధీ ప్రాంతంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత రాత్రి ఇటలీ ప్రధాని మారియో డ్రాగీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు వాటికన్‌ సిటీలో జరగబోయే జీ20 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌, ఇండోనేషియా, సింగపూర్‌, జర్మనీ దేశాధినేతలతో ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోప్‌ ఫ్రాన్సిస్‌తో మోదీ సమావేశం కానున్నారు.

అక్కడి నుంచి మోదీ నేరుగా యూకే బయల్దేరుతారు. యూకే ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ఆహ్వానం మేరకు నవంబరు 1న గ్లాస్గోలో జరిగే కాప్‌ 26 సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బోరిస్‌తోనూ ప్రధాని భేటీ కానున్నారు. పర్యటన ముగించుకుని నవంబరు 3వ తేదీ ఉదయానికి తిరిగి దిల్లీ చేరుకోనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని