Sengol: రాజదండాన్ని చేతికర్ర చేశారు కదా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ

చరిత్రాత్మక సెంగోల్‌కు (Sengol) గతంలో కాంగ్రెస్‌ తగిన గౌరవం ఇవ్వలేదని, చేతికర్మ మాదిరిగా మ్యూజియంలో భద్రపరిచిందని ప్రధాని మోదీ విమర్శించారు.

Published : 27 May 2023 23:21 IST

దిల్లీ: కాంగ్రెస్‌ హయాంలో చరిత్రాత్మక సెంగోల్‌కు (Sengol) తగిన గౌరవం ఇవ్వకపోవడంపై ప్రధాని మోదీ (PM Modi)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మార్పిడికి గుర్తుగా బ్రిటిష్‌ ప్రభుత్వం (British Govt) అందజేసిన రాజదండాన్ని ఓ చేతికర్ర మాదిరిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మ్యూజియంలో భద్రపరిచిందని విమర్శించారు. ఆదివారం పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సెంగోల్‌ను స్పీకర్‌ కుర్చీ పక్కన ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తమిళనాడులోని అథీనం మఠం ప్రముఖులు ఈ రాజదండాన్ని దిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో వేదమంత్రాల నడుమ ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘‘ స్వాతంత్ర్యానంతరం పవిత్ర సెంగోల్‌కు తగిన గౌరవం ఇచ్చి, ఉన్నత స్థానం కల్పించి ఉంటే బాగుండేది.  కానీ, దీనిని ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్‌ భవన్‌లో చేతికర్రలా భద్రపరిచారు. మీ సేవకుడిగా నేను, మన ప్రభుత్వం ఆ అపురూప గుర్తును అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చింది’’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దాదాపు 60 మంది హిందూ ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో చాలామంది తమిళనాడుకు చెందిన వారే. 

అధికార మార్పిడికి గుర్తుగా 400 ఏళ్ల  కిందట తిరువడుత్తురై అథీనం (ప్రస్తుత తమిళనాడులో ప్రఖ్యాత మఠం) మఠాధిపతుల సమక్షంలో మద్రాస్‌లోని స్వర్ణకారుడి చేత ఈ రాజదండాన్ని సిద్ధం చేయించారు. దాని పొడవు ఐదు అడుగులు ఉండగా..పై భాగంలో నంది చిహ్నన్ని న్యాయానికి ప్రతీకగా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ  మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని మొదట మౌంట్‌బాటన్‌కు అందించి, దానిని తిరిగి వెనక్కి తీసుకున్నారట. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి, నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారట. అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట. మరోవైపు బ్రిటిష్‌ వారి నుంచి అధికార మార్పిడి బదిలీకి గుర్తుగా సెంగోల్‌ను బహూకరించినట్లు ఆధారాలేవీ లేవని కాంగ్రెస్‌ చెబుతోంది. ఈ వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు భాజపా నేతలు ముక్తకంఠంతో ఖండించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని