Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్‌

కాంగ్రెస్‌ పాలనతో మనం దశాబ్ద కాలాన్ని కోల్పోయామని ప్రధాని మోదీ (Modi) దుయ్యబట్టారు. వారి హయాంలో జరిగిన కుంభకోణంతో దేశం పరువుపోయిందన్నారు. లోక్‌సభలో ప్రసంగించిన ఆయన.. ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 08 Feb 2023 17:25 IST

దిల్లీ: తమ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అది కొందరిని బాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) అన్నారు. దేశ ప్రగతిని చూసి బాధపడేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ప్రతిపక్షాలనుద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్‌ (Parliament) బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)) సహా విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

వారి విద్వేషం బయటపడింది..

‘‘రాష్ట్రపతి (President) ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంతో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. కోట్లాది భారతీయులకు మార్గదర్శనం చేశారు. ప్రథమపీఠంపై ముర్ము (Droupadi murmu) కూర్చోవడంతో ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కింది. దేశాధినేతగా ఆమె భారత మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి ప్రథమ పౌరురాలిని అవమానించేలా కొందరు నేతలు (రాహుల్, కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాకుండా అవమానించి వారు కూడా ప్రసంగించారు. వారి స్వభావమే అంత. అయితే ఆ ప్రసంగంతో వారిలోని సమర్థత, విద్వేషం బయటపడింది’’ అని రాహుల్‌ (Rahul Gandhi)ను ఉద్దేశిస్తూ ప్రధాని ఎద్దేవా చేశారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకే..

‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా.. ఆ సంక్షోభం నుంచి భారత్‌ బయటపడగలిగింది. నేడు ప్రపంచానికి మన దేశం ఆశాదీపంగా మారింది. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్లు అందించినందుకు యావత్ ప్రపంచం మనల్ని ప్రశంసించింది. మనపై గౌరవం పెరిగింది. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంపై ప్రపంచం ఆసక్తిగా చర్చించుకుంటోంది. జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది. కొవిడ్‌ ఉన్నప్పటికీ భారత్‌ ఐదో ఆర్థికశక్తిగా ఎదిగింది. ఇవన్నీ కొందర్ని బాధిస్తున్నట్లున్నాయి. దేశ ప్రగతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని విపక్షాలకు మోదీ హితవు పలికారు.

ఆ దశాబ్దాన్ని కోల్పోయాం..

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ (Congress) పాలనపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘2004 నుంచి 2014 మధ్య యూపీఏ హయాంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అంతటా హింసే కన్పించింది. అవినీతి, ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో కన్పించింది. వారి హయాంలో జరిగిన కామన్వెల్త్‌ ఆటల కుంభకోణంతో దేశం పరువుపోయింది. కాంగ్రెస్‌ ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చేసింది. ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం’’ అంటూ ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్‌ ఉత్థాన పతనాలపై హార్వర్డ్‌ వర్శిటీలోనూ పరిశోధన జరిగిందన్నారు.

విపక్షాలను ఏకం చేస్తున్నది ఈడీనే..

గత 9 ఏళ్లుగా విపక్ష నేతలు ఆలోచన లేకుండా ఆరోపణలే చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. ఆర్‌బీఐ, ఈసీ, సైన్యంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిర్మాణాత్మక విమర్శలను తాము స్వాగతిస్తామన్నారు. ‘‘నేడు విపక్ష నేతలు ఏకమవుతున్నది దేశం కోసం కాదు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వల్లే ఒక్కటవుతున్నారు. విపక్షాలను ఈడీ ఏకం చేస్తోంది’’ అని ప్రధాని విమర్శించారు.

టీవీ ప్రచారాలతో మోదీపై భరోసా రాలేదు..

‘‘మా హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలు మోదీపై భరోసా ఉంచారు. అంతేగానీ, టీవీ ప్రచారాల వల్ల కాదు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసమే మోదీపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. వారి నమ్మకమే నాకు సురక్షా కవచం. ఆ రక్షా కవచాన్ని ఎవరూ ఛేదించలేరు. విపక్షాల అవాస్తవాలను ప్రజలు నమ్మరు. కేంద్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందే ప్రజలకు నిజానిజాలేంటో తెలుసు. 2030 దశాబ్దం.. భారత దశాబ్దంగా నిలుస్తుంది. భారత్.. ప్రజాస్వామ్య మాతృభూమి. ప్రజాస్వామ్య బలోపేతం కోసం చిత్తశుద్ధితో కృషి జరగాలి’’ అని మోదీ వెల్లడించారు.

ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో భారత్‌ జోడో యాత్ర ముగింపు సభను ప్రస్తావించిన మోదీ.. ‘‘ఇప్పుడు జమ్ముకశ్మీర్‌కు అందరూ వెళ్లివస్తున్నారు. గతంలో లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడం ఓ కలగా ఉండేది. దమ్ముంటే లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని తీవ్రవాదులు పోస్టర్లు వేసేవారు. మా ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఆ పరిస్థితిని మేం మార్చాం. లాల్‌చౌక్‌లో స్వేచ్ఛగా జెండా ఎగురవేయగలుగుతున్నాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి అందుతోందని ప్రధాని అన్నారు. సాంకేతికత అభివృద్ధితో డేటా వినియోగం పెరగడమేగాక, ధర తగ్గిందన్నారు. మధ్యతరగతిపై తమ ప్రభుత్వం మరింత దృష్టిపెట్టిందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు