Ukraine Crisis: ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి భారత్‌.. అందుకే తరలింపు సాధ్యం!

ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన దేశంగా భారత్‌ ఎదుగుతుండడం వల్లే యుద్ధ వాతావరణంలోనూ ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురాగలుగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Published : 06 Mar 2022 23:32 IST

ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

పుణె: ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన దేశంగా భారత్‌ ఎదుగుతుండడం వల్లే యుద్ధ వాతావరణంలోనూ ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురాగలుగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఆపరేషన్‌ గంగ కార్యక్రమం ద్వారా వేల మందిని స్వదేశానికి చేరవేస్తున్నామని అన్నారు. పుణెలోని సింబయోసిస్‌ యూనివర్సిటీ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌ నుంచి తమ పౌరులను తరలించడంలో పెద్ద దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గుర్తుచేశారు.

‘ప్రపంచ వేదికపై భారత్‌ శక్తివంతంగా ఎదుగుతుండడం వల్లే ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలోనూ భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలుగుతున్నాం. ఈ విషయంలో పెద్ద దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇక దేశంలో అన్ని రంగాల్లో మార్పు జరుగుతుందంటే ఆ ఘనత దేశ యువతకే చెందుతుందన్నారు. ఏ రంగాల్లోనైతే దేశం స్వతహాగా ఎదగలేదని గతంలో భావించారో, ఆ రంగాల్లోనే భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ రంగాలతో పాటు రక్షణ రంగంలో దేశ పురోగాభివృద్ధిని ప్రస్తావించిన మోదీ.. రక్షణ రంగంలో ఎగుమతులు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని గుర్తుచేశారు.

తయారీ రంగం నుంచి వ్యాక్సిన్‌ అభివృద్ధి వరకు, సాఫ్ట్‌వేర్‌ నుంచి వైద్యరంగం వరకు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి అటోమొబైల్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, కంప్యూటింగ్‌ నుంచి మెషిన్‌ లెర్నింగ్‌ వరకు.. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్‌ గణనీయంగా వృద్ధి సాధిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సరికొత్త ఆవిష్కరణలు, పురోగాభివృద్ధితో ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసే స్థాయికి భారత్‌ చేరుకోవడం వల్లే సంక్షోభ సమయంలోనూ భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తరలించగలుగుతున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని