PM Modi: ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది: మోదీ

మహిళా రిజర్వేషన్ల బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భాజపా మహిళా మోర్చా నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి వినమ్రంగా నమస్కరించారు.

Published : 22 Sep 2023 17:19 IST

దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు (Women's Reservation Bill)కు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇది సాధారణ చట్టం కాదని.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బలమైన ప్రభుత్వం ఆవశ్యకతను చాటిచెప్పిన ప్రధాని.. దీని ద్వారానే ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న బిల్లు ఆమోదం పొందిందన్నారు. ఈ నేపథ్యంలో ‘భాజపా మహిళా మోర్చా’ సత్కార కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహిళా నేతలకు వినమ్రంగా నమస్కరించారు.

‘మహిళలకు రిజర్వేషన్ల అంశం దాదాపు మూడు దశాబ్దాలుగా నానుతూ వచ్చింది. గత పాలకులకు ఈ బిల్లుపై చిత్తశుద్ధి కరవైంది. అయితే, భాజపా ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేసింది. ఈ క్రమంలోనే దశాబ్ద కాలంలో మహిళలు ఒక శక్తిగా ఎదిగారు. అందుకే.. గతంలో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను చింపేసిన రాజకీయ పార్టీలే నేడు మద్దతివ్వాల్సి వచ్చింది’ అని ప్రధాని మోదీ అన్నారు. పూర్తి మెజారిటీ ఉన్న బలమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం పదేళ్ల కాలంలో వివిధ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

‘మహిళా రిజర్వేషన్ల’ను తక్షణమే అమలు చేయొచ్చు..! రాహుల్‌ గాంధీ

ఇదిలా ఉండగా.. చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు లోక్‌సభలోనూ బిల్లుకు ఆమోదం లభించింది. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం పార్లమెంటరీ చరిత్రలో సువర్ణ ఘట్టమని ప్రధాని మోదీ అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని