PM Modi: ఉక్రెయిన్‌లో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి.. ప్రధాని మోదీ పిలుపు

ఉక్రెయిన్‌లో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిష్కారానికి తిరిగి చర్చలు, దౌత్య మార్గాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. రష్యా ఈ యుద్ధాన్ని ముగించేలా...

Published : 04 May 2022 00:02 IST

కోపెన్‌హగెన్‌: ఉక్రెయిన్‌లో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిష్కారానికి తిరిగి చర్చలు, దౌత్య మార్గాలకు అనుసరించాలన్నారు. మరోవైపు.. రష్యా ఈ యుద్ధాన్ని ముగించేలా భారత్‌ తన పలుకుబడిని ఉపయోగించగలదని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సెన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. యూరప్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కోపెన్‌హెగెన్‌ విమానాశ్రయంలో దిగిన మోదీని ఆమె స్వయంగా ఆహ్వానించారు. అనంతరం ప్రధాని అధికారిక నివాసంలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్ సంక్షోభం, దాని ప్రభావం, ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు, వాతావరణ మార్పులతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు.

చర్చల అనంతరం మోదీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌లో తక్షణమే కాల్పుల విరమణకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంక్షోభాన్ని ముగించేందుకు ఇరు దేశాలు.. మరోసారి చర్చలు, దౌత్య మార్గాల బాటపట్టాలని కోరుతున్నాం’ అన్నారు. ‘పుతిన్ ఈ యుద్ధాన్ని ఆపాలనే మా సందేశం స్పష్టంగా ఉంది. ఈ దిశగా రష్యాను భారత్ ప్రభావితం చేస్తుందని ఆశిస్తున్నా’ అని ఫ్రెడరిక్సెన్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న మానవతా సంక్షోభంపై ఇరు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఉక్రెయిన్‌లో అమాయక పౌరుల మరణాలను ఇద్దరు ప్రధానులూ ఖండించారు. యుద్ధాన్ని తక్షణమే విరమించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. యూఎన్‌ ఛార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతల మీద ఆధారపడి ప్రపంచ క్రమం నిర్మితమై ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు’ అని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని