
Modi: ఒమిక్రాన్ కలవరం.. ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ
దిల్లీ: కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో పలు దేశాలు మళ్లీ ఆంక్షలు బాట పట్టిన వేళ.. ప్రధాని భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దాని పొరుగుదేశాలకూ వ్యాపించింది. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని..వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ వేరియంట్‌ను ఆందోళనకర రకంగా వర్గీకరించింది. దీనిపై యావత్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు కొత్త వేరియంట్ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు.. ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేదాజ్ఞలు జారీ చేసిన విషయం తెలిసిందే. భారత్ కూడా ఆ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.