Modi: మాట్లాడలేకపోతున్నా.. క్షమించండి..!

రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణలు తెలియజేశారు. ఆలస్యంగా రావడంతో ప్రసంగించలేకపోతున్నాని మైక్‌ తీసి పక్కన పెట్టారు.

Updated : 01 Oct 2022 15:10 IST

జైపుర్: ప్రధాని నరేంద్రమోదీ రాజస్థాన్‌ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో ప్రసంగించలేకపోతున్నానని మైక్‌ తీసి పక్కన పెట్టారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా ఆయన వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

శుక్రవారం మోదీ రాజస్థాన్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆయన అనుకున్న సమయాని కంటే ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ‘నేను ఇక్కడకు రావడం ఆలస్యమైంది. ఇప్పుడు రాత్రి పదవుతోంది. నేను నిబంధనలు తప్పక పాటించాలని నా మనస్సాక్షి చెప్తోంది. ఇప్పుడు మీ చెంత మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. మీ ప్రేమాభిమానాల కోసం మళ్లీ ఇక్కడికి వస్తానని మాటిస్తున్నాను’ అని మోదీ వెల్లడించారు. మైక్‌ను పక్కనపెట్టి, ఈ మాట చెప్పారు. వెళ్లేముందు ‘భారత్‌ మాతాకీ జై’ అని నినదించారు. అలాగే వేదికపై మోకాళ్ల మీద వంగి సభికులకు నమస్కరించారు. 

దీనికి సంబంధించిన వీడియోను భాజపా నేత అమిత్‌ మాలవీయ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘సమయం దాటి పోవడంతో బహిరంగ సభలో ప్రసంగించకూడదని మోదీ నిర్ణయించుకున్నారు. అప్పటికే అది ఏడో కార్యక్రమం. ఆయన వయసు 72. నవరాత్రి ఉపవాసం చేస్తున్నారు’ అని వెల్లడించారు. 

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో నిన్న మోదీ పర్యటించారు. తర్వాత ఆ పక్కనే ఉన్న రాజస్థాన్‌కు వచ్చారు. గుజరాత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ రాజస్థాన్‌లో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ ర్యాలీని ప్లాన్‌ చేశారు. అయితే ఆలస్యం కారణంగా ఈ ర్యాలీలో ప్రసంగించడం కుదరలేదు. కాంగ్రెస్‌ పాలనలో ఉన్న రాజస్థాన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని