PM Modi tour: 25మీటింగ్‌లు.. 8 మంది ప్రపంచ నేతలు.. 50మంది బిజినెస్‌ లీడర్స్‌!

మే 2 నుంచి మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌ దేశాల్లో పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. తొలుత జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్‌కు ....

Published : 01 May 2022 01:44 IST

ప్రధాని మోదీ యూరప్‌ టూర్‌ షెడ్యూల్‌ ఇలా..

దిల్లీ: మే 2 నుంచి మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని.. తిరుగు ప్రయాణంలో మే 4న పారిస్‌ చేరుకుంటారు. ఈ మూడు దేశాల్లో దాదాపు 65గంటల పాటు గడపనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. డెన్మార్క్‌, జర్మనీలలో ఒక రాత్రి చొప్పున బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 7 దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలు, 50 మంది అంతర్జాతీయ పారిశ్రాకవేత్తలతో సమావేశం కానున్న మోదీ.. మొత్తంగా 25 సమావేశాల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పలువురు ప్రపంచ నేతలతో భేటీలో ద్వైపాక్షిక, బహుపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. వేలాది మంది ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడనున్నారు. ఈ ఏడాదిలో మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. 

మరోవైపు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తోనూ మోదీ చర్చలు జరపనున్నారు. ‘జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్స్‌తో బెర్లిన్‌లో మోదీ భేటీ అవుతారు. భారత్‌-జర్మనీ అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో విడత సమావేశాలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. షోల్స్‌తో మోదీ భేటీ ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బుధవారం విలేకరులకు వెల్లడించిన విషయం తెలిసిందే. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంపై డెన్మార్క్‌ నిర్వహిస్తున్న సదస్సులోనూ మోదీ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానులతో ఆయన మాట్లాడనున్నారని వివరించారు. కరోనా అనంతర ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నవకల్పనలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీల్లో చర్చకు రానున్నాయని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని