Modi: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో.. మోదీ రయ్ రయ్‌

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. గాంధీనగర్‌ - ముంబయి మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు.

Updated : 30 Sep 2022 11:58 IST

గాంధీనగర్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌ - ముంబయి మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని ప్రారంభించారు. అనంతరం రైలులో కొంతదూరం ప్రయాణించారు.

ఈ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వే స్టేషన్‌లో ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత రైలెక్కి అందులోని వసతులను పరిశీలించారు. అలాగే అహ్మదాబాద్‌లోని కాల్పుర్‌ రైల్వే స్టేషన్‌ వరకు ప్రయాణించారు. మోదీతో పాటు రైల్వే సిబ్బంది కుటుంబాలు, మహిళా వ్యాపారవేత్తలు, యువత ఈ రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా మోదీ వారితో ముచ్చటించగా.. వారంతా ప్రధానితో ఫొటోలు తీసుకున్నారు.

గాంధీనగర్‌ నుంచి ముంబయి మధ్య నడిచే ఈ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కమర్షియల్‌ సేవలు అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు నడవనుంది. ఈ మార్గంలో ఈ రైలు టికెట్ కనిష్ఠ ధర రూ.1385, గరిష్ఠ ధర రూ. 2505గా ఉంది. కాగా.. దేశంలో ఇది మూడో వందే భారత్‌ రైలు. 2019లో తొలి వందే భారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూదిల్లీ - వారణాసి మార్గంలో ఈ సేవలను ప్రారంభించగా.. న్యూదిల్లీ - శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ గురువారం గుజరాత్‌కు వచ్చారు. నిన్న సూరత్‌, భావ్‌నగర్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. నేడు అహ్మదాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేస్‌-1ను మోదీ ప్రారంభించారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని