Modi: ఆ కుటుంబం కష్టం విని.. భావోద్వేగానికి గురైన మోదీ..!

గురువారం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతోన్న సమయంలో ప్రధాని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. గుజరాత్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఓ కుటుంబం చెప్పిన కష్టం విని, కొద్దిసేపు మౌనంగా మారిపోయారు.

Published : 12 May 2022 14:10 IST

దిల్లీ: ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతోన్న సమయంలో ప్రధాని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. గుజరాత్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో.. ఓ కుటుంబం చెప్పిన కష్టం విని, కొద్దిసేపు మౌనంగా మారిపోయారు. అసలేం జరిగిందంటే..

ఈ రోజు బరూచ్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల్లో ఒకరైన అయూబ్‌ పటేల్‌ను మోదీ పలకరించారు. అప్పుడు అయూబ్ మాట్లాడుతూ.. తన ముగ్గురు కుమార్తెలు చదువుకుంటున్నారని, ఇద్దరికి ప్రభుత్వ స్కాలర్‌షిప్ కూడా వస్తోందని చెప్పారు. అలాగే తన పెద్ద కుమార్తె ఆశయాన్ని ప్రధాని ముందు ఉంచారు. తన కుమార్తె ఇప్పుడు 12వ తరగతి చదువుతోందని.. భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటోందని చెప్పారు. ‘ఎందుకు వైద్య వృత్తి వైపు వెళ్లాలనుకుంటున్నావ్..?’ అంటూ అక్కడే ఉన్న ఆ అమ్మాయిని ప్రధాని ప్రశ్నించారు. ‘అందుకు మా నాన్న అనుభవిస్తున్న సమస్యే కారణం’ అంటూ కన్నీటి పర్యంతమైంది. సౌదీ అరేబియాలో పనిచేస్తోన్న సమయంలో కంట్లో వేసుకున్న చుక్కలముందు అయూబ్ చూపును దెబ్బతీసింది. దాంతో ఆయన మిగతావారిలా స్పష్టంగా చూడలేరు. కాగా, ఆయన కుమార్తె చెప్పిన కారణం విన్న ప్రధాని.. భావోద్వేగానికి గురై కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ వెంటనే తేరుకొని, ‘ఇతరుల పట్ల నువ్వు చూపుతున్న కరుణే నీ బలం’ అంటూ ఆమెను మెచ్చుకున్నారు. ఆమె చదువుకు అవసరమైనప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత వారి కుటుంబం రంజాన్ పండుగ ఎలా జరుపుకుందో అడిగితెలుసుకొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని