
Narendra Modi: పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతి ఇదే
వాటికన్ సిటీ: ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వాటికన్ సిటీలో క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన విషయం తెలిసిందే. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమైన వీరు.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, కొవిడ్ మహమ్మారి వంటి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. పోప్ ఫ్రాన్సిస్‌తో దిగిన చిత్రాలనూ ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. పోప్‌ను భారత్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మోదీ.. పోప్ ఫ్రాన్సిస్‌కు వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన కొవ్వొత్తుల స్టాండ్ (క్యాండెలాబ్రా)ను బహూకరించడం విశేషం. దీంతోపాటు వాతావరణ మార్పుల విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలపై రూపొందించిన ‘ది క్లైమెట్ క్లైంబ్’ పుస్తకాన్ని అందజేశారు. పోప్ సైతం ఓ కాంస్య ఫలకం, ప్రపంచ శాంతి, మానవ సౌభ్రాతృత్వం సందేశాలతో కూడిన పత్రాలు అందజేసినట్లు స్థానిక వార్తాసంస్థ వెల్లడించింది. వాటికన్ సిటీలో రోమన్ క్యాథలిక్ మత పెద్ద (పోప్)ను కలిసిన అయిదో భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. అంతకుముందు మాజీ ప్రధానులు జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయీ పోప్‌ను కలిశారు.