Agnipath: మోదీజీ.. మళ్లీ చెబుతున్నాం.. ‘అగ్నిపథ్‌’ వెనక్కి తీసుకోండి: రాహుల్‌

అగ్నిపథ్‌ పథకం (Agnipath Scheme) తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని బలహీన పరుస్తోందని.....

Published : 22 Jun 2022 16:23 IST

దిల్లీ: అగ్నిపథ్‌ పథకం (Agnipath Scheme) తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని బలహీన పరుస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. గతంలో సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్టుగానే ‘అగ్నిపథ్‌’ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భాజపా ప్రతీకార రాజకీయాలు, అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహలో రాహుల్‌ మాట్లాడారు.  నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) విచారణ జరుగుతున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈడీ తనను ప్రశ్నిస్తున్న సమయంలో తాను ఒంటరిగా లేనని.. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త, నేతలూ తన వెంటే ఉన్నారన్నారు. దేశంలో అతి పెద్ద సమస్య ఉద్యోగాలేనన్న రాహుల్‌.. కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దెబ్బ తీయడం ద్వారా దేశం వెన్నెముకను విరగ్గొడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ మన దేశాన్ని ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు అప్పగించారని, చివరకు సైన్యంలో ఉద్యోగాలను కూడా మూసివేశారని మండిపడ్డారు.

ఎప్పుడూ వన్‌ ర్యాంక్‌ - వన్‌ పెన్షన్‌ గురించి మాట్లాడే కేంద్రం పెద్దలు ఇప్పుడు ‘నో ర్యాంక్‌ - నో పెన్షన్‌’ అనే స్థాయికి చేరుకున్నారని ఆక్షేపించారు. చైనా సైన్యం మన భూ భాగంలోకి వచ్చి తిష్ఠ వేస్తే.. సైన్యాన్ని బలోపేతం చేసుకోవాల్సింది పోయి బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. కేంద్రం అవలంబిస్తున్న వైఖరి దేశానికి నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సత్యాగ్రహలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని