Ukraine Crisis: ఉక్రెయిన్‌ సంక్షోభం.. దేశ భద్రతా సంసిద్ధతపై ప్రధాని సమీక్ష

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోన్న వేళ.. దేశ భద్రతకు సంబంధించిన సంసిద్ధత, అంతర్జాతీయ పరిణామాలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్...

Updated : 13 Mar 2022 15:20 IST

దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోన్న వేళ.. దేశ భద్రతకు సంబంధించిన సంసిద్ధత, అంతర్జాతీయ పరిణామాలపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ తదితరులతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌, త్రివిధ దళాధిపతులు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం క్రమంలో జీవ, రసాయన ఆయుధాల ప్రస్తావన అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడం, రష్యా ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసిన ప్రస్తుత తరుణంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్‌లోని పరిస్థితులు, అక్కడినుంచి భారతీయుల తరలింపుపై ప్రధాని మోదీ ఇటీవలి కాలంలో వరుస సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌, రష్యా అధ్యక్షులు జెలెన్‌స్కీ, పుతిన్‌లతోనూ మాట్లాడారు. ‘యుద్ధం ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్ రెండింటితో.. మన దేశ అవసరాలు ముడిపడి ఉన్నాయి. అయితే భారత్‌.. శాంతి పక్షాన ఉంది. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్న’ట్లు ప్రధాని మోదీ ఇటీవల ఓ సభలోనూ చెప్పారు. మరోవైపు ‘ఆపరేషన్‌ గంగ’ ద్వారా భారత్‌.. ఉక్రెయిన్‌లోని దాదాపు 16 వేలకుపైగా భారత పౌరులను అక్కడి పొరుగు దేశాల నుంచి స్వదేశానికి తరలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని