PM Modi roadshow: 50 కి.మీలు.. 16 నియోజకవర్గాలు.. మోదీ మెగా రోడ్‌ షో

గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Election2022)ల్లో గెలుపే లక్ష్యంగా భాజపా(BJP) వినూత్న ప్రచార వ్యూహంతో దూసుకెళ్తోంది. నేటితో తొలి విడత పోలింగ్‌ పూర్తి కావడంతో.. మలి విడత ఎన్నికలపై పూర్తిస్థాయి ఫోకస్‌ను పెట్టింది.

Published : 02 Dec 2022 01:32 IST

అహ్మదాబాద్‌: గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Election2022)ల్లో గెలుపే లక్ష్యంగా భాజపా(BJP) వినూత్న ప్రచార వ్యూహంతో దూసుకెళ్తోంది. నేటితో తొలి విడత పోలింగ్‌ పూర్తి కావడంతో.. మలి విడత ఎన్నికలపై పూర్తిస్థాయి ఫోకస్‌ను పెట్టింది. హిందుత్వ ప్రయోగశాలగా పేర్కొనే గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇమేజ్‌పైనే భారీ ఆశలు పెట్టుకున్న కమలదళం.. ఆయనతో చరిత్రలోనే నిలిచిపోయేలా మెగా రోడ్‌షో చేపట్టింది. 16 నియోజకవర్గాలను కవర్‌ చేసేలా ఏకంగా 50 కి.మీల మేర ఈ రోడ్‌ షో నిర్వహించింది. ఈ వినూత్న కార్యక్రమంతో దేశంలోనే ఇంత సుదీర్ఘ రోడ్‌ షో నిర్వహించిన నేతగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు.

మోదీ-షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో వరుసగా ఏడోసారి రికార్డు విజయం నమోదు చేసి తమ వ్యూహాలకు ఎదురులేదని చాటేందుకు సర్వశక్తుల్ని ధారపోస్తుస్తున్నారు కమలనాథులు. ఇందులో భాగంగా తమ సత్తా చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో ఏకంగా 50కి.మీల మెగా రోడ్‌ షో నిర్వహిస్తున్నారు. గోద్రాలోని సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం తర్వాత 2002లో అలర్లు చెలరేగిన ప్రాంతం నరోడాగామ్‌ నుంచి ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ తన రోడ్‌షోను మొదలు పెట్టారు. అక్కడి నుంచి టక్కర్‌బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్‌పూర్ ఖాడియా, ఎలిస్‌బ్రిడ్జ్, వెజల్‌పూర్, ఘట్లోడియా, నారన్‌పూర్, సబర్మతి తదితర నియోజకవర్గాల మీదుగా కొనసాగి గాంధీనగర్‌ సౌత్‌లో మెగా రోడ్‌షో ముగియనుంది. ఈ మార్గంలో ప్రయాణానికి దాదాపు 3.5గంటల సమయం పడుతుందని అంచనా.

 

భాజపా చేపట్టిన ఈ భారీ రోడ్‌షోలో వేలాది మంది భాజపా కార్యకర్తలు, అభిమానులు కాషాయ జెండాలు పట్టుకొని డప్పులు వాయిస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలు ఓ పండుగ వాతావరణాన్నితలపిస్తున్నాయి. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఓపెన్‌ టాప్‌ జీప్‌లో ఉన్న ప్రధాని మోదీ అభివాదం చేస్తూ ప్రజల్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయనేత ఇంత పెద్ద రోడ్‌షో నిర్వహించలేదని భాజపా పేర్కొంటోంది. ఈ రోడ్‌షోలో ప్రధాని దాదాపు 35 చోట్ల ఆగనున్నారు. రోడ్‍షో కొనసాగుతున్న  మార్గంలో పండిట్ దీన్‍దయాళ్ ఉపాధ్యాయ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‍తో పాటు పలువురు ప్రముఖుల స్మారక చిహ్నాల వద్ద ఆగి ప్రధాని ప్రసంగిస్తూ ముందుకు సాగుతున్నారు. గుజరాత్‌ ఎన్నికల వేళ ప్రధాని  మోదీ ఇప్పటివరకు 20 ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. డిసెంబర్‌ 5న 93 స్థానాలకు జరిగే రెండో దశ ఎన్నికలకు గాను ఇంకా మరో ఏడు ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని