Modi: ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు (Egyptian President) .. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. 

Updated : 25 Jan 2023 19:27 IST

దిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఈజిప్టు అధ్యక్షుడు (Egyptian President) అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం దిల్లీకి చేరుకున్న ఆయన.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ డొమైన్‌, వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు.

‘ఆసియా, ఆఫ్రికా మధ్య వారధిగా ఉండే ఈజిప్టుతో తమ సంబంధాలు మరింత పెరుగుతున్నాయి. ప్రాచీన, సాంస్కృతిక, ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు జరిపిన విస్తృత చర్చలు ఎంతో దోహదం చేస్తాయి’ అని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.

మూడో భారత్‌-ఆఫ్రికా ఫోరమ్‌ సదస్సులో భాగంగా ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌-సిసి 2015 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. అనంతరం 2016 సెప్టెంబర్‌లోనూ అధికారిక పర్యటనకు వచ్చారు. అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఓ ఈజిప్టు అధ్యక్షుడు ఆహ్వానం పొందడం మాత్రం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో 120 మందితో కూడిన ఈజిప్టు సైనిక బృందం సైతం పాల్గొననుంది.

మరోవైపు అరబ్‌, ఆఫ్రికా దేశాల రాజకీయాల్లో ఈజిప్టు ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందనే చెప్పవచ్చు. ఆఫ్రికా, ఐరోపా మార్కెట్లకు ప్రధాన గేట్‌వేగానూ ఈ దేశాన్ని పరిగణిస్తారు. అలాంటి ఈజిప్టుతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్‌ ఆసక్తి చూపుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు