PM Modi: ఆ కిచెన్‌లో లక్ష మందికి వంట చేయొచ్చు.. ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన సొంత నియోజకవర్గం వారణాసి (Varanasi)లో పర్యటిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా......

Published : 07 Jul 2022 16:31 IST

అక్షయపాత్ర మిడ్‌ డే మీల్‌ కిచెన్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

లఖ్‌నవూ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన సొంత నియోజకవర్గం వారణాసి (Varanasi)లో పర్యటిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించి రెండోసారి అధికారం చేపట్టాక ఆయన తొలిసారి కాశీకి వెళ్లారు. వారణాసిలోని ఎల్‌టీ కళాశాలలో అక్షయపాత్ర మిడ్‌ డే మీల్‌ కిచెన్‌ (Akshaya Patra midday meal kitchen)ను ప్రారంభించారు. లక్ష మంది విద్యార్థులకు వంట చేసే సామర్థ్యం కలిగి ఉండటం ఈ కిచెన్‌ ప్రత్యేకత. ఈ పర్యటనలో భాగంగా మోదీ రూ.1,774 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు. అయితే, ఈ కిచెన్‌ ప్రారంభోత్సవంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ప్రకారం ఇలాంటి కిచెన్‌లు 11 చోట్ల ప్రారంభించాల్సి ఉందన్నారు. విద్యార్థులకు వేడివేడిగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో తాము అక్షయపాత్ర యోజన ప్రారంభించామన్నారు. గత ఐదేళ్ల భాజపా పాలనలో దీన్ని మూసివేశారనీ.. విద్యార్థులు, యువతలో ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఇప్పుడు ఈ పథకాన్ని పునఃప్రారంభించాల్సి వచ్చిందని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. 

కాశీ ప్రజల మధ్య ఉండటం నాకెప్పుడూ ఆనందమే

ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కాశీ ప్రజల మధ్య ఉండటం తనకెప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2గంటలకు అక్షయపాత్ర మిడ్‌ డే మీల్‌ కిచెన్‌ను ప్రారంభించనున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఈ కిచెన్‌ లక్ష మంది విద్యార్థులకు వంట చేసే సామర్థ్యం కలిగినదని.. విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. అలాగే వారణాసిలో రూ.1800 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వీటిలో పట్టణాభివృద్ధితో పాటు ‘నమో ఘాట్‌’ అభివృద్ధి, కాశీ వారసత్వ సంబంధిత పలు ప్రాజెక్టులు ఉన్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని