Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!

ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 61 పతకాలు దేశానికి అందించి, భారత్‌ను నాలుగో స్థానంలో నిలిపిన క్రీడా బృందం శనివారం ప్రధాని మోదీని కలుసుకుంది.

Updated : 13 Aug 2022 14:15 IST

కామన్వెల్త్‌ బృందంతో మాట్లాడిన ప్రధాని

దిల్లీ: ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 61 పతకాలు దేశానికి అందించి.. భారత్‌ను నాలుగో స్థానంలో నిలిపిన క్రీడా బృందం శనివారం ప్రధాని మోదీని కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో వారితో ముచ్చటించారు. వారు సాధించిన విజయాలను కొనియాడారు. అలాగే చెస్‌ ఒలింపియాడ్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. 

‘మీ షెడ్యూల్‌లో వెసులుబాటు చేసుకొని నా కుటుంబసభ్యుల్లా మీరంతా నన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మీతో మాట్లాడుతున్నందుకు.. మిగతా భారతీయుల వలే నేను చాలా గర్వపడుతున్నాను. మన దేశం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ.. మీ కృషితో క్రీడల్లో దేశం రెండు విజయాలను నమోదు చేసింది. మొదటిసారి చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో పాటుగా.. కామన్వెల్త్ క్రీడల్లో చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. చెస్‌ ఒలింపియాడ్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా.. ఆ ఈవెంట్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. దీనిలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికీ.. పతకాలు సాధించిన వారికి నా అభినందనలు’ 

‘కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందు నేను మీకొక మాట చెప్పాను. మీరు తిరిగి వచ్చాక అంతా కలిసి విజయోత్సవం జరుపుకొందామన్నాను. మీరు విజయంతో తిరిగి వస్తారని నేను నమ్మాను. బిజీగా ఉన్నా.. మిమ్మల్ని కలుసుకోవాలని అనుకున్నాను. క్రితంసారితో పోలిస్తే.. నాలుగు కొత్త క్రీడల్లో విజయానికి బాటలు వేశాం. లాన్‌ బౌల్స్‌ నుంచి అథ్లెటిక్స్ వరకూ అపూర్వ ప్రదర్శన చేశాం. యువత కొత్త క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ఈ విజయాలు దోహదం చేస్తాయి. ఈ దిశగా మన పనితీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంది’ అని మోదీ సూచించారు.

బర్మింగ్‌హామ్ వేదికగా ఈ ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఇందులో భారత్‌ 61 పతకాలు సాధించి.. నాలుగో స్థానంలో నిలిచింది. 22 బంగారు, 16 వెండి, 23 కాంస్య పతకాలను సాధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని