Yoga Day: విదేశాల్లోనూ యోగా.. 2015 తర్వాతే ఈ మార్పు: మోదీ

Yoga Day: శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Updated : 21 Jun 2024 09:52 IST

Yoga Day | శ్రీనగర్‌: విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం (International Yoga Day) నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోదీ (Narendra Modi) గుర్తుచేశారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ.. యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే అనేక పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైందన్నారు. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు.

ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్‌ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్‌-ఏ-కశ్మీర్‌ సమావేశ కేంద్రానికి మార్చారు. ఫలితంగా కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.

యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగానూ ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రులు జైశంకర్‌, బీఎల్‌ వర్మ, కిషన్‌ రెడ్డి, ప్రహ్లాద్‌ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్‌ రిజిజు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అవగాహన కల్పించారు.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దిల్లీలోని యమునా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది మందితో కలిసి యోగసనాలు వేస్తూ అవగాహన కల్పించారు. మరో మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సైతం దిల్లీలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిహద్దుల్లో సైనికుల దగ్గరి నుంచి ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య యుద్ధనౌక వరకు అనేక చోట్ల యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్‌ స్క్వేర్‌ కూడలిలో వేలాది మంది ఆసనాలు వేసి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని