G7 Summit: అణుభూమిలో శాంతి సందేశం.. హిరోషిమాలో గాంధీ విగ్రహావిష్కరణ చేయనున్న మోదీ

ఆరురోజుల విదేశీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ(Modi) జపాన్‌(Japan) పయనమయ్యారు. పలు అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ నేతలతో చర్చలు జరపనున్నారు. 

Published : 19 May 2023 12:28 IST

దిల్లీ: జీ-7 సదస్సు(G7 Summit) కోసం ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) శుక్రవారం జపాన్‌ పయనమయ్యారు. హిరోషిమా పట్టణంలో జరుగుతోన్న ఈ సదస్సులో భారత్‌ ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఉంది. భారత్‌ జీ-20కి అధ్యక్షత వహిస్తోన్న ఈ సమయంలో జీ-7 సదస్సులో పాల్గొనడం అర్థవంతమైందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రయాణానికి ముందు ట్విటర్‌లో పోస్టు పెట్టారు.  

‘హిరోషిమాలో జరుగుతోన్న జీ-7 సదస్సు కోసం జపాన్‌(Japan) బయలుదేరాను. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే ప్రపంచస్థాయి నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటానని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ఆగ్రహానికి గురవడంతో 1945, ఆగస్టు 6న జరిగిన  అణు దాడి కారణంగా జపాన్‌లోని హిరోషిమా పట్టణంలో నాడు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దాని తాలూకు దుష్ప్రభావాలతో ఇప్పటికీ అక్కడ అనారోగ్యంతో అనేక మంది జీవితాలు బలవుతున్నాయి. జపాన్‌ ప్రధాని కిషిద సొంతూరు హిరోషిమానే కావడం గమనార్హం. 

ఈ రోజు నుంచి మొత్తం ఆరు రోజుల పాటు మోదీ(Modi) విదేశీ పర్యటనలో ఉంటారు. జపాన్‌ పర్యటనలో భాగంగా ఆయన హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అహింస ద్వారానే శాంతిని నెలకొల్పగలమని గాంధీ ప్రపంచానికి సందేశం ఇచ్చారు. ఇప్పుడు అణుభూమిలో శాంతి సందేశంగా గాంధీ విగ్రహం కొలువుతీరనుంది.

ప్రముఖ పారిశ్రామిక, పెట్టుబడిదారీ అగ్రదేశాల కూటమే ఈ జీ-7! ఇందులో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌ ఇందులో సభ్యదేశాలు. ప్రపంచ జీడీపీలో వీటి వాటా దాదాపు 50 శాతం. భారత్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, వియత్నాంలాంటి మరికొన్ని దేశాల అధినేతలు జీ-7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఇంధన సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థల నాయకులూ సదస్సులో పాల్గొంటారు. ఆస్ట్రేలియాలో రద్దయిన క్వాడ్‌ (భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌) సదస్సును జీ-7 సమావేశాల సందర్భంగా జపాన్‌లోనే నిర్వహించాలనుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని