Hasina-Modi: చిరకాల మైత్రిపై కొత్త చేవ్రాలు

భారత్‌-బంగ్లాదేశ్‌ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసుకునేరీతిలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తీస్తా నదీజలాలను పరిరక్షించుకుని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్టు నిర్మాణం సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరింది.

Published : 23 Jun 2024 04:51 IST

తీస్తా నదీజలాలపై భారీ ప్రాజెక్టు
వేర్వేరు రంగాల్లో 10 ఒప్పందాలు
భారత్‌-బంగ్లాదేశ్‌ చర్చల్లో అంగీకారం
మోదీ, ముర్ములతో హసీనా భేటీ 

దిల్లీ: భారత్‌-బంగ్లాదేశ్‌ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసుకునేరీతిలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తీస్తా నదీజలాలను పరిరక్షించుకుని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్టు నిర్మాణం సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరింది. భారత్‌లో పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా శనివారం ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన చర్చల్లో మొత్తం 10 ఒప్పందాలు ఖరారయ్యాయి. తీస్తా నదీ జలాల నిర్వహణ నిమిత్తం త్వరలోనే మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించడం, సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్లేలా చర్చల్ని ప్రారంభించడం, రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకోవడం వంటివి దీనిలో ఉన్నాయి. డిజిటల్‌ రంగం, నౌకాయానం, రైల్వే, అంతరిక్షం, హరిత సాంకేతికత, వైద్యం-ఔషధాలు వంటి రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయి. సరిహద్దులను శాంతియుతంగా నిర్వహించుకునేలా పనిచేయడంపైనా ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. మన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తీస్తా జలాలపై వంద కోట్ల డాలర్ల (సుమారు రూ.8,350 కోట్లు) ప్రాజెక్టు చేపట్టేందుకు చైనా కూడా ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. హసీనా వచ్చేనెల చైనా వెళ్లనున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం

భారత పర్యటనకు వచ్చిన షేక్‌ హసీనాకు ప్రధాని మోదీ సమక్షంలో శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి హసీనా నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌లతో ఆమె మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భారత్‌ తమకు విశ్వసనీయమైన భాగస్వామి అని, భారత్‌తో సంబంధాలకు తామెంతో విలువనిస్తామని హసీనా పేర్కొన్నారు.


ఇ-మెడికల్‌ వీసా ప్రారంభిస్తాం: మోదీ 

సరిహద్దులో ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడంతోపాటు శాంతిస్థాపనకు కృషి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు మోదీ విలేకరులకు తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు తోడుగా నిలిచేందుకు బంగ్లాదేశ్‌ ముందుకు రావడాన్ని స్వాగతించారు. వైద్యచికిత్స కోసం మన దేశానికి వచ్చే బంగ్లాదేశ్‌వాసుల కోసం ఇ-మెడికల్‌ వీసా ఇవ్వడంతోపాటు రంగపుర్‌లో సహాయ హైకమిషన్‌ కార్యాలయాన్ని తెరవాలని నిర్ణయించినట్లు వివరించారు. రక్షణరంగ ఉత్పత్తులు, బంగ్లాదేశ్‌ సైనిక దళాల ఆధునికీకరణపైనా ప్రతిపాదనల్ని పరస్పరం ఆమోదించుకున్నట్లు చెప్పారు. సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం (సెపా)పై చర్చలు ప్రారంభించబోతున్నామని తెలిపారు. 1996 నాటి గంగా జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ఉన్నప్పుడు 2011లోనే తీస్తా జలాల ఒప్పందం కుదరాల్సి ఉన్నా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ అభ్యంతరాలతో చివరిక్షణంలో ఆగిపోయింది. కోల్‌కతా-రాజ్‌షాహీ మధ్య ప్రయాణికుల రైలు, రెండు దేశాల మధ్య గూడ్సు రైలు రాకపోకలపై తాజాగా ఒప్పందాలు కుదిరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని