PM Modi US Visit: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ప్రధాని మోదీ భేటీ

 అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ యూఎస్‌ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా రెండో దశలో సహకరించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ గెలవడం చారిత్రాత్మకమని మోదీ అన్నారు. ప్రపంచానికి కమలా హారిస్‌ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. 

Updated : 24 Sep 2021 06:43 IST

వాషింగ్టన్‌: భారత్‌- అమెరికా సహజ భాగస్వాములు అని ప్రధాని మోదీ అన్నారు. రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశాలు అని, ఒకే రకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ యూఎస్‌ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో తొలిసారి వైట్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ గెలవడం చరిత్రాత్మకమని మోదీ అన్నారు. ప్రపంచానికి కమలా హారిస్‌ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. బైడెన్‌, కమలా హారిస్‌ నేతృత్వంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సమన్వయం, సహకారం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌ను ప్రధాని మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు. 

భారత సంతతి మహిళ అయిన కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్లజాతి ఉపాధ్యక్షరాలిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రధానితో భేటీ సందర్భంగా కమలా హారిస్‌ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్‌ ప్రత్యేక భాగస్వామి అని ఆమె అన్నారు. టీకా ఎగుమతుల పునురుద్ధరణపై భారత్‌ ప్రకటనను కమలా హారిస్‌ స్వాగతించారు. కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్‌ వనరుగా ఉందన్నారు. కరోనా ఉద్ధృతిలో భారత్‌కు సహకరించినందుకు గర్వంగా ఉందని కమలా పేర్కొన్నారు. భారత్‌లో రోజుకు కోటి మందికి టీకా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయని కమలా హారిస్‌ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదేశాలపై ఉందని తెలిపారు. 

నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదటి రోజు ప్రధాని ఐదు దిగ్గజ కంపెనీలు అయిన క్వాల్‌కామ్‌, అడోబ్‌, ఫస్ట్‌ సోలార్‌, జనరల్‌ అటమిక్స్‌, బ్లాక్‌స్టోన్‌ సీఈవోలతో చర్చలు నిర్వహించారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ యోషిహిదే సుగాతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సుగాతో మోదీ చర్చించారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో భవిష్యత్‌ కార్యచరణపై చర్చించారు.  



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని